బయటపడిన బోటు బాగోతం...

 

అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో.. విజయవాడ బోటు ప్రమాదం ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విజయవాడ బోటు ప్రమాదంలో దాదాపు 23 మంది ప్రాణాలు బలైన సంగతి తెలిసిందే కదా. జరగాల్సిన నష్టం జరిగిన తరువాత కానీ.. అసలు విషయాలు బయటపడుతున్నాయి ఇప్పుడు. ఇబ్రహీంపట్నం వద్ద ప్రమాదవశాత్తు మునిగిన ఫెర్రీ బోటును బయటకు తీశారు. దీన్ని పరిశీలించిన అధికారులకు దిమ్మ తిరిగిపోయే వాస్తవం ఒకటి అర్థమైంది. బయటకు తీసిన తరువాత తెలిసింది ఆ బోటు బాగోతం ఏంటో. అసలు అది బోటు కానే కాదట. సముద్రంలో చేపలు పట్టేందుకు వాడే పడవట. ఆ పడవకే కొన్ని హంగులు అద్ది.. పర్యాటక పడవగా మార్చేశారు. ఇక ఈ బోటును పరిశీలించి.. అనుమతి ఇవ్వాల్సిన అధికారులు కూడా.. చూసీచూడనట్టుగా వ్యవహరించడంతో ఇంత ప్రమాదం జరిగింది.

 

వాస్తవానికి ఈ పడవ కేవలం పది మందిని మాత్రమే తీసుకెళ్లే సామర్థ్యం ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. పది మంది కంటే ఎక్కువ మంది ఎక్కితే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తనిఖీ అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన బోటుపై లాంచీల్లో పెట్టినట్లుగా గొడుగు పెట్టారు. పది మంది ఎక్కాల్సిన బోటులో 40 మంది ఎక్కారని.. ప్రమాదం కానీ మరింత లోతుగా ఉన్న ప్రాంతంలో జరిగి ఉంటే.. ఒక్కరు కూడా బతికి ఉండేవారు కాదన్న విషయాన్ని వారు చెబుతున్నారు. మొత్తానికి అటు వ్యాపారస్థుల వల్ల కానీ... అధికారుల నిర్లక్ష్యం వల్ల అయితేనేం కానీ.. అమాయకుల ప్రాణాలు నీటిపాలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోకపోతే.. ముందు ముందు ఇంకెన్ని ప్రమాదాలు చూడాల్సి వస్తుందో..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu