మోకాలి నొప్పుల వెనుక రహస్యం ఇదే!

కొందరు చేయి పైకెత్తితే చాలు భరించలేని నొప్పితో విలవిల్లాడిపోతారు. మరికొందరు నాలుగడుగులు వేయగానే నడుము నొప్పంటూ కూర్చుండిపోతారు. ఇక మోకాలి నొప్పి సంగతైతే చెప్పనే అక్కర్లేదు. అది ఇంటింటి బాధగా మారిపోయింది. అందరు మనుషుల్లోనూ ఒకే తీరున ఈ బాధలు ఎందుకు కనిపిస్తున్నాయి? మనిషి పరిణామక్రమానికీ, ఈ నొప్పులకీ మధ్య సంబంధం ఏమన్నా ఉందా? అన్న అనుమానం వచ్చింది ఆక్స్‌ఫర్డుకి చెందిన పరిశోధకులకి. దాంతో ఆ నొప్పుల వెనుక ఉన్న రహస్యం కాస్తా బయటపడిపోయింది.

 

నాలుగు నుంచి రెండుకి

మనిషి కూడా మొదటి మిగతా జంతువులగానే నాలుగుకాళ్ల మీదే నడిచేవాడన్న విషయం తెలిసిందే! క్రమేపీ రెండుకాళ్ల మీద నిలబడటంతో అతని మేధస్సు కూడా పరుగులెత్తడం మొదలుపెట్టింది. ఇలా రెండు కాళ్ల మీద నడిచే క్రమంలో అతని కీళ్ల మధ్య కొన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ మార్పులను తెలుసుకునేందుకు పరిశోధకులు దాదాపు 300 అస్థిపంజరాలను గమనించారు. వీటిలో 40 కోట్ల సంవత్సరాల నాటి మనుషుల ఎముకలు కూడా ఉన్నాయి. వాషింగ్టన్‌లోని స్మిత్‌సోనియన్‌ సంస్థ సేకరించిన ఈ పురాతన ఎముకలకి సంబంధించిన స్కాన్లను పరిశీలించి ఆనాటికీ, ఈనాటికీ మన ఎముకల తీరులో వచ్చిన మార్పులను పోల్చి చూశారు.

 

బోలెడు మార్పులు

మనిషి నిలబడి నడిచేటప్పుడు మరింత బరువుని మోసేందుకు వీలుగా, అతని తుంటి ఎముక దిగువ భాగం కాస్త వెడల్పుగా మారిందట. దీని వలన అది త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉందని తేలింది. ఆ కారణంగానే మనలో ఆర్థ్రైటిస్ సమస్యలు తలెత్తుతున్నాయట. ఇక భుజం కీలు దగ్గరేమో దీనికి విరుద్ధమైన మార్పు కనిపించింది. నడిచేటప్పుడు భుజాల మీద భారం తగ్గడం వల్లనో ఏమో... అక్కడి కీలు ఎముక మధ్య ఉన్న ఖాళీ తగ్గిందని తేలింది. దీని వల్ల ఆ ప్రదేశంలో ఉండే రక్తనాళాలు, కండరాలు నొక్కుకుపోతున్నాయని గమనించారు. చేతిని పైకెత్తగానే ఒక్కసారిగా భుజం కండరాలు విలవిల్లాడిపోవడానికి కారణం ఇదే కావచ్చు. మనుషుల మోకాళ్లు త్వరగా అరిగిపోవడానికి కూడా పరిణామక్రమంలో వచ్చిన ఈ మార్పులే కారణమని బయటపడింది.

 

ఆరంభం మాత్రమే

అసలే పరిణామక్రమంతో మన శరీరంలో కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయని బాధపడుతుంటే... ఇది మున్ముందు మరింత తీవ్రం కానుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఈ మార్పులు ఇలాగే కొనసాగితే మరో 4000 ఏళ్ల తరువాత మోకాలు, తుంటి, భుజానికి సంబంధించి మరిన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే తగినంత వ్యాయామం చేయడం, నిటారుగా నడవటం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ లోపాలను కొంతవరకు ఎదుర్కోవచ్చునని సూచిస్తున్నారు.

 

- నిర్జర.