ప్రేమ వివాహాలకు బాసటగా కేరళ హైకోర్టు

ఇటీవలి కాలంలో దేశంలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకొనే వారి సంఖ్య ఎక్కువవుతోంది. తెలిసి తెలియని ఉరకలు వేసే వయస్సు, ఒకరినొకరు ఇష్టపడి, ప్రేమ మొదలై పెళ్లిళ్లకు దారితీస్తోంది. అయితే కాలం ఎంత మారినా.. పెద్దల మనసు మారడం లేదు.. తమ ఇంటి పిల్లో/పిల్లాడో కులం తక్కువ వారిని ప్రేమించాడనో.. వేరే మతం వారిని ప్రేమించాడనే అక్కసుతో కన్నప్రేమను మరిచిపోయి బిడ్డల ఉసురు తీస్తున్నారు. వీటినే పరువు హత్యలు అంటారు. ఇది ఏ ఒక్క ప్రాంతానికో, రాష్ట్రానికో పరిమిత కాలేదు.. దేశమంతా ఇదే ధోరణి ఉంది. ప్రాణం కంటే కుటుంబ ప్రతిష్ట ఎక్కువ అనుకోవటమే వారిని ఇలా ప్రేరేపిస్తుంది.

 

అయితే అలాంటి ప్రేమ జంటలకు బాసటగా నిలిచింది కేరళ హైకోర్టు. లవ్ జిహాద్ వ్యవహారంపై న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. తన భార్యను బలవంతంగా తీసుకెళ్లిన ఆమె తల్లిదండ్రులు ఘర్‌వాపసీ అంటూ మతం మార్పించారని ఓ ముస్లిం యువకుడు కోర్టును ఆశ్రయించాడు. కన్నూర్‌కు చెందిన ఓ హిందూ యువతి ఎర్నాకులంకు చెందిన ఒక ముస్లిం యువకుడిని ప్రేమించింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించిన ఆ యువతి ఈ ఏడాది మే 16న ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోంది. దీనిపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని వారు లవ్ జిహాద్ అంటూ ప్రచారం చేశారు. తమ కుమార్తెను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి, తన మతాచారం పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు.

 

తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వీరి జాడను హర్యానాలోని సోనిపట్‌లో గుర్తించింది. అనంతరం యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. వారు ఆమెను తిరిగి హిందూ మతంలోకి మార్చి అతన్ని మరచిపోవాలని హెచ్చరించారు. ఈలోగా సదరు ముస్లిం యువకుడు కోర్టును ఆశ్రయించడం.. న్యాయస్థానం విచారణ ప్రారంభించడం అన్ని చకచకా జరిగిపోయాయి. వీరిద్దరి వివాహాం చెల్లుతుందని.. ఆమె నిర్భయంగా తన భర్తతో కలిసి వెళ్లవచ్చని తీర్పు చెప్పింది. మరోవైపు బలవంతపు మత మార్పిడి కేంద్రాలను తక్షణమే గుర్తించి న్యాయస్థానం పోలీస్ శాఖను ఆదేశించింది. మతాంతర వివాహాల అనంతరం వారిని ఉగ్రసంస్థల్లోకి పంపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా గత ఏడాది వ్యవధిలో ఒక్క కేరళలోనే ఈ తరహా వివాహాలు 90 వరకు జరిగాయని గుర్తించింది. వీటిలో 23 పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఇస్లామిక్ రాడికల్ గ్రూప్ నేతృత్వంలో జరగటం విశేషం.