నేను కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదు

గత వారం రోజులుగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన వ్యక్తి రేవంత్ రెడ్డి. తెలంగాణ తెలుగుదేశానికి ఆశాజ్యోతిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ పార్టీని వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని మీడియాలో విస్తృతంగా కథనాలు వెలువడ్డాయి. దానికి తోడు ఏపీ టీడీపీ నేతలు పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, యనమల రామకృష్ణుడుపై వ్యాఖ్యలు చేయడంతో ఆ కథనాలకు మరింత బలం చేకూరింది.

 

ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడం గ్యారెంటీ అని అంతా ఫిక్సయిపోయారు. మొన్న జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలోనూ రేవంత్ విషయంపైనే ప్రధానంగా చర్చించారు. అయితే తాను ఏ పార్టీలోనూ చేరడం లేదంటూ మరో సంచలనం సృష్టించారు రేవంత్ రెడ్డి. ఇవాళ మీడియాతో మాట్లాడిన రేవంత్.. తనపై మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. పేదల కోసం పోరాడి తాను గుర్తింపు తెచ్చుకున్నానని చెప్పారు. మా పార్టీ నాయకులపై వస్తున్న వార్తలు.. కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నాయని అన్నారు. తమ అధినేత చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తానని.. రాబోయే ఎన్నికల్లోనూ కొడంగల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తానని రేవంత్ తెలిపారు.