పోతిరెడ్డిపాడు పొక్కని పెద్దగజేషిన దొంగ వై.ఎస్
posted on Nov 26, 2012 9:34AM
.jpeg)
.jpeg)
నల్గొండజిల్లా సూర్యాపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ చంద్రబాబునీ, వై.ఎస్ రాజశేఖర్ రెడ్డినీ టార్గెట్ చేశారు. ఇద్దరిమీదా తీవ్రస్థాయిలో పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ దుమ్మెత్తిపోశారు. చంద్రన్న రాజ్యంలో రైతుల ఆత్మహత్యలకు అంతే లేకుండా పోయిందంటూ చెలరేగిమాట్లాడుతూ జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కేసీఆర్.
వై.ఎస్ బతికున్నన్నాళ్లూ పరోక్షంగాకూడా పదునైన మాటలు మాట్లాడ్డానికి సాహసించని కేసీఆర్ ఇప్పుడు నేరుగా ఆయన్ని “దొంగ” అని సంబోధించారు. పోతిరెడ్డిపాడు పొక్కని పెద్దగజేసి తెలంగాణ నీళ్లని దొంగిలించుకుపోయిన గజదొంగ రాజన్న అంటూ వై.ఎస్ పై కేసీఆర్ నిప్పులు చెరిగారు.
“పోతిరెడ్డిపాడుకి పెద్ద పొక్కబెట్టి ముందలకేస్తరట, నలభైఏళ్లసంది పండబెట్టిన ఎస్సెల్బీసీ మాత్రం గట్లనే పండ్తదట” అంటూ రెచ్చగొట్టేతీరులో కేసీఆర్ ప్రసంగం సాగింది. వై.ఎస్ సంక్షేమ పథకాల ప్రభావం తెలంగాణపైకూడా విపరీతంగా ఉందని గుర్తించిన టిఆర్ఎస్ నేతలు.. దాన్ని తగ్గించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా కేసీఆర్ తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా వై.ఎస్ పై తీవ్రస్థాయిలో పదునైన మాటల్ని ప్రయోగించడం ఇందుకు తార్కాణం. తెలంగాణ ప్రజల పాలిట వై.ఎస్ సైంధవుడు, రాక్షసుడు, యముడిలా ప్రవర్తించారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.