కాంగ్రెస్‌ పార్టీ దేశానికి పట్టిన చీడ పురుగు : కేసీఆర్

 

వనపర్తిలో టీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. కాంగ్రెస్, టీడీపీ గత పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు.కాంగ్రెస్‌ పార్టీ దేశానికి పట్టిన చీడ పురుగని కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.'పాలమూరును టీడీపీ, కాంగ్రెస్ కలిపి 58 ఏళ్లు పాలించాయి. ఇప్పుడు నాలుగున్నరేళ్లు టీఆర్ఎస్ పాలించింది. వాళ్ల పాలనలో తెలంగాణ ఎలా ఉంది? టీఆర్ఎస్ పాలనలో ఎలా ఉంది?’ అని ప్రజల అభిప్రాయాన్ని కేసీఆర్ కోరారు.గొర్రెలంటే ఈ కాంగ్రెస్ గొర్రెలకు తెలియదని,రోజూ 650 లారీల గొర్రెలు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు దిగుమతి అవుతున్నాయి.అది గమనించే గొర్రె పిల్లలు పంపిణీ చేశాం.బలమైన గొల్లకురుమలు దేశంలో ఎక్కడున్నారంటే తెలంగాణలో ఉన్నారనే పేరు మనకు రాబోతోంది' అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

‘గద్వాల్‌లో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడారు. కత్తి తిప్పాల్సిన చోట తిప్పని కాంగ్రెస్‌ నేతలు.. ఇప్పుడు తిప్పుతున్నారు. సమైక్య రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు మోసం జరిగింది. నాటిమోసాన్ని అధిగమించి ఇప్పుడైనా.. కోటి ఎకరాలకు నీరు సాధించుకోవాలి. 2004లో వైఎస్ మాయలో పడి సోనియా తెలంగాణ ఇవ్వలేదన్నారు. చివరకు తెలంగాణ సమాజం అంతా కలిసి గట్టిగా పోరాడితేనే తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి అనే దుర్మార్గుడు తెలంగాణ ప్రాజెక్టులను పెండింగ్ పెట్టి పాలమూరును ఎండబెట్టారని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక.. కరువును తరిమెయ్యాలనే ఉద్దేశంతో 40 మంది రిటైర్డ్ ఇంజినీర్లతో నదులపై సర్వే చేయించానని చెప్పారు. వారి సలహా మేరకు ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టామన్నారు. దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం.. నీళ్లు ఎలా వస్తాయో చూపిస్తామని రమ్మంటే.. కాంగ్రెస్ నేతలు శాసనసభకు రాకుండా పారిపోయారని,పాలమూరు జిల్లా బీడు భూమిగా మారడానికి కాంగ్రెస్‌ నేతలే కారణం అని కేసీఆర్ విమర్శించారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాను చంద్రబాబు 9ఏళ్లు దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాకు చంద్రబాబు ఏం చేశారు? మన తెలంగాణ నిర్ణయాలు మనమే తీసుకుందామా.. విజయవాడ, ఢిల్లీ నేతలు తీసుకోవాలా? అని పాలమూరు ప్రజలు ఆలోచించుకోవాలి అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.‘నేను చెప్పిన మాట్లలో వాస్తవం లేకుంటే తెరాసను ఓడించండి, నిజముంటే పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలి. తెలంగాణ కోసం 19 ఏళ్లుగా పోరాడుతున్నా. ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి. ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ కావాలి. ఆరునూరైనా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.90 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేస్తోంది. ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లిస్తేనే పాలమూరు జిల్లాలో ఓట్లు అడుగుతా. డిసెంబరు నాటికి మిషన్‌ భగీరథ పూర్తి చేసి ఇంటింటికీ నల్లా నీళ్లు ఇస్తామన్నారు.