మాజీ ఎమ్మెల్యే రాజబాబు కన్నుమూత

కృష్ణా జిల్లా కైకలూరు మాజీ ఎమ్మెల్యే ఎర్నేని రాజా రాంచందర్ (రాజబాబు) తుదిశ్వాస విడిచారు. గ‌త‌ కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న ఆయన.. ఆదివారం సాయంత్రం తన స్వగ్రామమైన కొండూరులో క‌న్నుమూశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో కొన‌సాగిన ఆయ‌న‌.. ఇండిపెండెంట్‌గాను విజ‌యం సాధించారు. కైకలూరు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒకసారి, కాంగ్రెస్ తరఫున మరోసారి ఎన్నికయ్యారు. 

తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాంచందర్ టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలోకి వెళ్లారు. 1994లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.1999 ఎన్నికల్లో టీడీపీ ఆయ‌న‌కు టికెట్ ఇవ్వకపోవడంతో, ఇండిపెండెంట్ గా బ‌రిలోకి దిగిన‌ రాజబాబు మంచి మెజారిటీతో గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక నేత‌గా ఎదిగారు. 2004లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 2009 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చ‌విచూశారు. ఆ త‌ర్వాత వైఎస్సార్ మ‌ర‌ణం, రాష్ట్ర విభజన, త‌ద‌నంత‌ర ప‌రిస్థితుల వ‌ల్ల‌ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. ఎర్నేని మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.