రాయచోటి కాంగ్రెస్ టిక్కెట్ కై పోటాపోటీ
posted on Mar 30, 2012 12:06PM
కడపజిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెట్ కు పోటీ పెరిగింది. నిన్నటి వరకూ ఈ టిక్కెట్ కోసం పిసిసి సభ్యుడు రాం ప్రసాద్ రెడ్డి, రమేష్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అధిష్టానం కూడా వీరిద్దరిలో ఒకరి పేరును పరిశీలించే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గంగా ఉన్న ముస్లింలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నియోజకవర్గంలో అభ్యర్ధుల జయాపజయాలను నిర్ణయించే శక్తి ముస్లింలకే ఉంది. ఇది గమనించిన మైనారిటి నేతలు ఈసారి కాంగ్రెస్ టిక్కెట్ తమ వర్గానికి ఇవ్వాలని ఇటీవల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.
ముస్లింల తరపున పోటీకి కాంగ్రెస్ నాయకులు కాసింఖాన్ సిద్ధపడుతున్నారు. గతంలో హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయినా కాసింఖాన్ ఈసారి మాత్రం తనకు రాయచోటి టిక్కెట్ ఇస్తే తప్పక గెలుస్తానని అధిష్టానానికి భరోసా ఇస్తున్నారు. 1977 అసెంబ్లీ ఎన్నికల్లో రాయచోటి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా హాబీబుల్లా విజయం సాధించారు. ఆ తరువాత 1983లో కాంగ్రెస్ అభ్యర్ధిగా శ్రీమతి హబీబుల్లా, 1985లో తెలుగుదేశంపార్టీ తరపున దాదేసాహెబ్ లు పోటీచేసి ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి ఏ పార్టీ కు ముస్లింలకు టిక్కెట్ ను కేటాయించలేదు. దీంతో ముస్లింలు అంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు