జూలకంటికి బాబు జలక్
posted on Mar 31, 2012 11:21AM
గుంటూరుజిల్లా మాచర్ల అసెంబ్లీ టిక్కెట్ ను ఆశిస్తున్న జూలకంటి బ్రహ్మారెడ్డికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జలక్ ఇచ్చారు. 2004-2009 ఎన్నికలో టిడిపి తరపున పోటీ చేసిన జూలకంటి వచ్చే ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని ఆశించారు. అయితే ఆయన ఈసారి కూడా గెలిచే అవకాశం ఏమాత్రం లేదని భావించిన బాబు ఆయనకు టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఆయనను చంద్రబాబునాయుడు హైదరాబాద్ కు పిలిపించుకుని ఈ విషయం స్పష్టం చేశారు. దీంతో జూలకంటి నిరాశతో తిరిగి గుంటూరుజిల్లా చేరుకున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధిని నిలబెట్టబోతున్నాయి.
దీంతో స్థానికంగా బలమైన మరో సామాజికవర్గం నుంచి గానీ లేదా బిసి అభ్యర్ధికి గాని టిక్కెట్ ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబునాయుడు ఉన్నారు. జూలకంటి బ్రహ్మారెడ్డిని పక్కన పెట్టడంతో ప్రస్తుతం రంగంలో ముగ్గురు మిగిలారు, వీరిలో ఒకరు పన్నెండేళ్ళుగా పార్టీలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ సామాజికవర్గంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇతరవర్గాల ఓట్లు కూడా తనకు పడతాయని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. టిక్కెట్ ను ఆశిస్తున్న మరో నాయకుడు గతంలో పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశారు. మరో నాయకుడు తన కుటుంబం చాలాకాలంగా పార్టీకి చేసిన సేవలు గుర్తుచేస్తూ టిక్కెట్ అడుగుతున్నారు. చంద్రబాబునాయుడు ఈ ముగ్గురిలో ఒకరికి అభ్యర్ధిగా ఎంపికచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.