మంటలు రగిల్చిన ఆర్ డి ఎస్ ప్రాజెక్ట్
posted on Mar 31, 2012 11:59AM
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్ డి ఎస్) నీటి ప్రాజెక్టు తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చింది. ఈ ప్రాజెక్టు నీటి వాడకంపై తెలంగాణా ప్రాంతంలోని మహబూబ్ నగర్ జిల్లా, రైతాంగం, రాయలసీమ ప్రాంతంలోని కర్నూల్ జిల్లా రైతాంగం తరచు ఘర్షణలకు దిగుతున్నారు. ఈ నేపద్యంలో ఆర్ డి ఎస్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సీతారామ్ రెడ్డి కర్నూల్ కు నీరు ప్రవహించకుండా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్ డి ఎస్ ప్రాజెక్టు నీటి పంపకం విషయమై గత కొద్ది కాలంగా ఈ రెండు జిల్లాల మధ్య తరచ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. నిజం కాలం నాటి పాత ఒప్పందం ప్రకారం ఆర్ డి ఎస్, కెసి కాలువలకు 40:60 నిష్పత్తి నీటి వాటాలున్నాయని ఆర్ డి ఎస్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సీతారామ్ రెడ్డి అంటున్నారు.
అయితే తుంగభద్ర డ్యామ్ నుంచి విడుదలైన మొత్తం నీటిని నిబంధనలకు విరుద్ధంగా సీమ ప్రాంతానికి తరలించేందుకు ఆనకట్ట వద్ద ఆర్ డి ఎస్ షట్టర్లను మూసివేశారని ఆయన ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులను, ప్రాజెక్టు కమిటీ సభ్యులను, ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా షట్టర్లను మూయించడంపై ఏకపక్షంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. అయితే కర్నూల్ జిల్లా రైతాంగం వాదలో మరోలా ఉంది. మహబూబ్ నగర్ జిల్లా రైతాంగం కాలువనీటిని కర్మూలు జిల్లాలోకి రాకుండా చేయడానికి ఇసుక బస్తాలను అడ్డుగా వేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల కర్నూల్ జిల్లాలో వందలాది ఎకరాల పంటలు, ఎండిపోతున్నాయని, రైతాంగం నష్టపోతుందని కర్నూల్ జిల్లా నాయకులు అంటున్నారు. కాలువ ప్రవాహానికి అడ్డుగా ఇసుక బస్తాలు వేస్తే సహించేది లేదని, అవసరమైతే తమ ప్రాణాలు త్యజించి తమ హక్కులను కాపాడుకుంటామని కర్నూల్ జిల్లా రైతాంగం అంటోంది. మరోవైపు ఆర్ డి ఎస్ నుంచి మహబూబ్ నగర్ జిల్లాకు రావాల్సిన నీటి వాటాను ఇవ్వకపోతే ఆందోళనలను మరింత ఉద్రేకం చేస్తామని సీతారామ్ రెడ్డి హెచ్చరిస్తున్నారు.