టిడిపి మహానాడుకి ఆహ్వానించలేదు: జూ.ఎన్టీఆర్

 

తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహిస్తున్న రెండు రోజుల మహానాడు సమావేశాలకు హరికృష్ణ హాజరు కావడం అందరికీ చాలా ఆశ్చర్యం కలిగించినా ఆయన అలక వీడి వచ్చినందుకు అందరూ సంతోషించారు. అయితే ఆయన కుమారుడు జూ యన్టీఆర్ సమావేశానికి రాకపోవడం గురించి మీడియాలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అతను కోరుండే రాలేదని కొందరూ, తండ్రి వద్దని వారించడం వలెనే రాలేదని ఇంకొందరూ, సినిమా షూటింగ్ కోసం విదేశాలలో ఉండి పోవడం వలననే రాలేదని మరి కొందరు రకరకాలుగా చెప్పుకొంటున్నారు.

 

తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం తాము హరికృష్ణకు, జూ.యన్టీఆర్ ఇద్దరికీ కూడా ఆహ్వానాలు పంపినట్లు తెలియజేసారు.

 

కానీ, జూ.యన్టీఆర్ మామగారయిన నార్నే శ్రీనివాసరావుకి చెందిన స్టూడియో యన్ న్యూస్ చానల్లో “మహానాడుకి రమ్మని నాకు పార్టీ నుండి ఎటువంటి ఆహ్వానము రాలేదు. వచ్చి ఉంటే తప్పక హాజరయ్యేవాడిని. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాదించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎన్నికలలో నేను పార్టీ కోసం పని చేస్తాను,” అంటూ జూ.యన్టీఆర్ చెప్పినట్లు స్క్రోలింగ్ వస్తోంది.

 

మరి అదే నిజమయితే జూ. యన్టీఆర్, తెదేపా నేతలలో ఎవరు అబద్దమాడుతున్నట్లు? యన్టీఆర్ మాటలు నిజమనుకొంటే, మరి అతనికి ఆహ్వానం రానప్పుడు అతని తండ్రికి మాత్రమే తెదేపా ఆహ్వానం పంపిందా? అదే నిజమయితే అందుకు హరికృష్ణ ఏవిధంగా అంగీకరించారు? తనకి ఆహ్వానం పంపి తన కుమారుడుకి పంపకపోయి ఉంటే ఆయన అదే విషయం సభలోనే నిలదీసేవారు కదా? అలా జరుగాలేదంటే యన్టీఆర్ కి ఆహ్వానం అందినట్లే కదా. మరటువంటప్పుడు మామగారి న్యూస్ చానల్లో ఆవిధంగా స్క్రోలింగ్ ఎందుకు ఇచ్చినట్లు? జూ.యన్టీఆర్ తరపున అతని మామగారు కూడా ఇప్పుడు రంగంలోకి దిగారనుకోవాలా? ఈ ప్రశ్నలకు జూ.యన్టీఆర్ మాత్రమే సమాధానం చెప్పగలడు.