చంద్రబాబు నోట అవిశ్వాస తీర్మానం

 

చంద్రబాబు మొన్న మీడియాతో మాట్లాడుతూ అవసరమయితే తమ పార్టీ వచ్చే నెల 10నుండి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలలో కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడుతుందని ఒక మాట అన్నారు. రెండు నెలల క్రితం తెరాస, వైకాపాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పడు మద్దతు ఈయకుండా దూరంగా ఉండి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పరోక్ష సహాయం చేసి కాపాడిన చంద్రబాబు, మరిప్పుడు ఎందుకు మళ్ళీ ఆ ఆలోచన చేస్తున్నట్లు అని అందరూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.

 

నిజానికి ఇది అవిశ్వాసం పెట్టే సమయం కాదని చంద్రబాబుకి తెలియకపోలేదు. ఎన్నికలకి పూర్తి స్థాయిలో సిద్దం కాకుండా, ఇటువంటి సమయంలో అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్నికూలిస్తే దానివల్ల తేదేపాకు లాభం కంటే నష్టమే ఎక్కువుతుందని ఆయనకీ తెలుసు. అయినా ఆవిధంగా మాట్లాడటం ఎందుకంటే తనకీ, కిరణ్ కుమార్ రెడ్డికి మద్య రహస్య ఒప్పందం ఉందని, తానే వెనుక నుండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాననే వైకాపా ఆరోపణలను ఎదుర్కోవడానికి మాత్రమే. ఒకవేళ ఆయనకు నిజంగా ఆ ఆలోచన ఉండి ఉంటే అవిశ్వాస తీర్మానానికి అవసరమయిన మద్దతు కూడగట్టడానికి ఇప్పటికే ఆయన తగిన ప్రయత్నాలు మొదలు పెట్టి ఉండేవారు. కానీ, ఆయన అటువంటి ఆలోచన కూడా ఏమీ చేయట్లేదు కనుక ఈ అవిశ్వాస తీర్మానం కేవలం వైకాపా ఆరోపణలను ఎదుర్కోవడానికి మాత్రమేనని చెప్పవచ్చును.