అలా చేస్తే జగన్‌ ను సన్మానించి రాజకీయాల నుంచి తప్పుకుంటా: జేసీ ప్రభాకర్ రెడ్డి

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అరెస్ట్ అయ్యి కడప జైల్లో ఉన్న టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డితో పాటు ఆయన తనయుడు అస్మిత్‌ రెడ్డి జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జైలులో కూడా కక్ష సాధింపు తీరుతోనే వ్యవహరించారని ఆరోపించారు. తనకు ఆహారం కూడా ఇవ్వకుండా జైలు అధికారులపై ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. 

 

అక్రమ రిజిస్ట్రేషన్ల విషయంలో తనపై ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. వాహనాలు రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను ప్రశ్నించాలని అన్నారు. తమను ఏజెంట్లు మోసం చేశారన్న ఆయన.. ఇంజిన్, చాయిస్ నెంబర్లు కొడితే వాహనం వివరాలు మొత్తం వస్తాయని.. తమ సంతకాలు ఉంటే ఉరి వేయమన్నానని గతంలో చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు.

 

రాజకీయాలు చేయాలనకునేవారు ఏదైనా చేస్తారన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఎవరిపైనైనా అక్రమ కేసులు పెట్టగలదని.. గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు జగన్ తనను అరెస్ట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ హయాంలో 11 రోజులు జైల్లో ఉన్నానని, ఇప్పుడు 54 రోజులు జైల్లో ఉంచారన్నారు. అరెస్టులు చేయాలనుకుంటే పెద్దగా కారణాలు అవసరం లేదన్నారు. అలాగే జైలు నుంచి విడుదలైన తర్వాత జరిగిన ర్యాలీలో తాను పోలీసులతో దురుసుగా ప్రవర్తించాననడం దారుణమన్నారు.

 

టీడీపీని వీడుతున్నారని జరుగుతున్న ప్రచారంపైనా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాము విభజన తర్వాత కాంగ్రెస్ ద్రోహం చేయడంతో టీడీపీలోకి వచ్చామని,  టీడీపీలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. ఎవరో ఏదో అనుకుంటే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, పార్టీ మారే ఆలోచన లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

 

కాగా, మూడు రాజధానుల నిర్ణయంపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి స్పందిస్తూ.. ఏపీ ప్రభుత్వం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే తాను సీఎం జగన్‌ ను సన్మానించి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు.