బీజేపీలో జనసేన కలవనుంది.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు!!
posted on Sep 4, 2019 2:48PM

బీజేపీలో జనసేన విలీనం కానుందని.. లేదా బీజేపీ, జనసేన కలిసి పని చేయనున్నామని కొద్దిరోజులు క్రితం వార్తలు షికార్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవల అన్నం సతీష్ టీడీపీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ లోగా బీజేపీలో జనసేన కలుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వస్తారని, ఆయన కోసం ఢిల్లీ నాయకులు కూడా ఏపీకి వస్తారని తెలిపారు. పవన్ సీఎం అయితే చూడాలని ఉందని చెప్పారు. బీజేపీలో పవన్ చేరితే ఆయన బలం అమాంతం పెరుగుతుందని, ఆ తర్వాత ఆయనను ఎవరూ ఆపలేరని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని సీఎం జగన్ జాగ్రత్త పడుతున్నారని చెప్పారు. అన్నం సతీష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.