పద్మభూషణ్ వద్దు...భారతరత్న కావాలి: ఎస్.జానకి
posted on Jan 26, 2013 10:36AM

ప్రభుత్వం తనకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడం పట్ల ప్రముఖ గాయని ఎస్.జానకి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాకు భారతరత్న తప్ప మరో అవార్డు అవసరం లేదని తేల్చి చెప్పారు. పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా మీడియా ఆమెను స్పందన కోరింది. దీంతో ఆమె తీవ్రంగా స్పందించారు. అసలు నాకు పద్మభూషణ్ అవార్డు అక్కర్లేదని చెప్పారు.
“ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ అవార్డు వచ్చి ఉపయోగం ఏముంది? దక్షిణాదికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది. నేను పెద్దసంతృప్తిగా అయితే ఏమీ లేను. పద్మభూషణ్ కంటే ఎక్కువే ఆశించాను. ఉత్తరాదికిచ్చిన ప్రాధాన్యం దక్షిణాదికి ఇవ్వట్లేదు. భారత రత్న ఇస్తే తీసుకుంటా. అంతకంటే తక్కువస్థాయిది ఏదిచ్చినా తీసుకోను. అభిమానుల గుండెల్లో నేను ఎక్కడో ఎత్తున ఉన్నాను. ఈ అవార్డు ఇవ్వడం పట్ల ప్రభుత్వాన్ని తప్పుబట్టను గానీ, ఇన్నాళ్లకు గుర్తించడం బాధగా ఉంది” అని అన్నారు.