వందల సంఖ్యలో కార్యకర్తలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలోకి వలస?
posted on Jun 19, 2012 10:01AM
అనుకున్నట్లే జరుగుతోంది. ఉపఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్, తెలుగుదేశంపార్టీలకు చెందిన వందలాదిమంది కార్యకర్తలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వైపు వలసబాట పట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా ధోరణి కనబడుతోంది. అనంతపురం జిల్లాలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలం తక్కువగా ఉంది. అయినా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆ పార్టీలోకి వలసలు హఠాత్తుగా పెరిగాయి. ఒకేసారి మూడువందలకు పైగా కార్యకర్తలు గుంతకల్లు మండలంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. ఆ పార్టీ గుంతకల్లు ఇన్ ఛార్జి వై.వెంకటరామిరెడ్డి కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్, టిడిపి కార్యకర్తలు తమ పార్టీవైపు ఆకర్షితులవుతున్నారని రామిరెడ్డి తెలిపారు. పామిడిమండలం రామగిరి, ఎన్. వెంకటాపల్లికి చెందిన కార్యకర్తలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొత్త కార్యకర్తలను మెడలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కండువాలతో పార్టీలోకి నాయకులు ఆహ్వానించారు. దీంతో జిల్లాలో రెండు ప్రధానపార్టీలపై కార్యకర్తల ప్రభావం చూపుతుందని రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్, టిడిపి నాయకులు తమను కరివేపాకుల్లా వాడుకుని వదిలేశారని, అధికారంలో ఉన్నప్పుడు కూడా వారు తమకేమీ చేయలేదని అందువల్ల వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న భావనను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వలసలను ఆపడం కాంగ్రెస్, టిడిపి లకు తలనొప్పిగా మారింది.