కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటుతో లబ్ధికి జగన్ ప్రయత్నం

 

ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ‘సమైక్య ఓదార్పుయాత్ర’ నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి, 2014ఎన్నికల తరువాత తను మద్దతు ఇస్తానని చెప్పిన సోనియా గాంధీ మీద కూడా తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. ఆమె తన కొడుకు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే మన రాష్ట్రం విడదీస్తోందని విమర్శించారు. సీమాంధ్ర ప్రజలను హైదరాబాదు నుండి బయటకి పొమ్మనట్లే, ఆమెను కూడా ఇటలీకి పొమ్మంటే పోతారా? అని ప్రశ్నిస్తున్నారు. తనకు 30యంపీ సీట్లు ఇస్తే, రాష్ట్రాన్ని ఎలాగ విడదీస్తారో చూస్తానని సవాలు చేస్తున్నారు. అప్పుడు తనే దేశానికి ప్రధానిగా ఎవరుండాలో నిర్ణయిస్తానని అంటున్నారు.

 

జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అంత్యక్రియలు కూడా చేయకుండానే, ముఖ్యమంత్రి పదవి కోసం శాసనసభ్యుల సంతకాలు సేకరించిన నాడే తన పదవీ కాంక్ష బయటపెట్టుకొన్నారు. నేటికీ కూడా సమైక్యాంధ్ర సెంటిమెంటుతో 30యంపీ సీట్లు సంపాదించుకొందామనే యావే తప్ప, నిజంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే చిత్తశుద్ది అతనిలో ఏ కోశాన్న కనబడటం లేదు. తను ముఖ్యమంత్రి అయ్యేందుకు, ప్రజలలో కాంగ్రెస్ పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేఖతను తనకు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నంలోనే సోనియా గాంధీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంత మాత్రాన్న తమ పార్టీ వచ్చే ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలో యూపీయేకి మద్దతు ఈయదని ఖరాఖండిగా ఎన్నడూ చెప్పరు కూడా.

 

వచ్చేఎన్నికలు పూర్తయ్యే వరకు అతను, అతని పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ తమ ప్రధాన శత్రువన్నట్లుగానే మాట్లాడుతారు. ఎన్నికల తరువాత ఒకవేళ యూపీయే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచగలిగే స్థితిలో ఉంటే, అప్పుడు తప్పకుండా దానికే మద్దతు ఇచ్చి జగన్ తన కేసుల నుండి బయటపడే ప్రయత్నం చేయవచ్చు. బహుశః అందుకే నారా లోకేష్ ఇటీవల ట్వీట్ చేస్తూ వైకాపాకి, ప్రజారాజ్యానికి పెద్దగా తేడా లేదని విమర్శించారు.       

 

 

సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించి తన కొడుకుని ప్రధానిని చేయాలనుకొంటుంటే, జగన్ రాష్ట్ర విభజన అంశాన్ని ఈవిధంగా ఉపయోగించుకొని ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇద్దరూ కూడా రాష్ట్ర విభజన ద్వారా లబ్ది పొందాలనుకొంటున్నపుడు మరి వారిరువురి మధ్య తేడా ఏమిటి?

 

ఆమె రాష్ట్ర విభజన చేసి లాభం పొందాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్న జగన్మోహన్ రెడ్డి, తను రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత కూడా సమైక్యవాదంతో, కాంగ్రెస్ వ్యతిరేఖ ఓటు అనే రెండు అంశాలను తెలివిగా వాడుకొని ఎన్నికలలో గెలిచి, కేంద్రంలో రాష్ట్రంలో కూడా చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఇద్దరివీ లక్ష్యాలు వేరయినా, అందుకు వారు అనుసరిస్తున్న మార్గం మాత్రం ఒక్కటే.