సర్వరోగ నివారణి ‘రాయల తెలంగాణ’
posted on Dec 2, 2013 10:23AM

రాష్ట్ర విభజన తేనెతుట్టెని కదల్చగానే కేంద్రాన్ని అనేకానేక సమస్యలు చుట్టుముట్టాయి. కొన్ని సమస్యలు ప్రథమ చికిత్స చేస్తే తగ్గిపోయే రోగాల్లాంటివి కాగా, మరికొన్ని సమస్యలు ఎప్పటికీ వదలక పీడించే దీర్ఘకాలిక రోగాల్లాంటివి. ఈ రోగాలన్నిటినీ నివారించే సర్వరోగ నివారణి ‘రాయల తెలంగాణ’ అని కేంద్రం భావిస్తోంది.
రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వుండే అద్భుతమైన ఫలితాలేవో వచ్చేస్తాయని కేంద్రం కలలు కంటోంది. కొత్త రాష్ట్రంలో తాను అధికారంలోకి రావడానికి, ఎక్కువ ఎంపీ సీట్లు గెలవటానికి, టీఆర్ఎస్, బీజేపీలను కొత్త రాష్ట్రంలో కంట్రోల్ చేయడానికి, అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేసుకోవడానికి, జలవివాదాలు తలెత్తకుండా వుండటానికి, సీమాంధ్రకు రాజధాని సమస్య రాకుండా వుండటానికి... ఇలా ఒకటీ రెండు కాదు రెండు మూడు డజన్లకు పైగా అంశాలను కేంద్రం ఆలోచించి పెట్టేసుకుంది.
తెలంగాణను ప్రకటించి తాను తప్పు చేశానన్న అపరాధభావం కాంగ్రెస్ పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో అంతర్లీనంగా వుంది. తనకు ఎంతమాత్రం ఉపయోగపడేలా లేని లేనిపోని తద్దినాన్ని అనవసరంగా నెత్తికెత్తుకున్నానని మథనపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైతే తెలంగాణ ఇవ్వకుండా తప్పించుకోవడానికి కూడా రాయల తెలంగాణ ప్రతిపాదన ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.