ఒక జగన్ కేసు, రెండు అభిప్రాయాలు

 

మనం ఏరంగు కళ్ళద్దాలు పెట్టుకొంటే లోకం కూడా ఆ రంగులోనే కనబడుతుంది. జగన్ మోహన్ రెడ్డి కేసు విషయంలో సిబిఐ మరియు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి నాటకమాడుతూ బెయిలు దొరకనీయకుండా చేస్తూన్నాయని జగన్ తరపువారు ఆరోపిస్తుంటే, అతనిని కాపాడేందుకే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకు అడిగిన సమాచారం ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ జగన్ వాదన సరయినదనుకొంటే, కోర్టులు ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి ఈ పాటికే సమన్లు జారీచేసి ప్రభుత్వ సంజాయిషీ కోరుండాలి. గానీ కోరలేదు, అంటే జగన్ నిర్దోషని కోర్టులు కూడా నమ్మకపోవడమేకారణం అనుకోవచ్చును.


ఒకవేళ చంద్రబాబు వాదన సరయినదయితే, రాష్ట్రంలో ప్రధానప్రతిపక్షపార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీయే స్వయంగా ఆ పనికి పూనుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా కోర్టులో కేసువేసి సిబిఐకి సమాచారం అందివ్వకుండా జాప్యం చేస్తూ జగన్నిఎందుకు కాపాడుతున్నారని నిలదీయవచ్చును. గానీ తెలుగుదేశం ఆపని ఇంతవరకు చేయలేదు. అంటే చంద్రబాబు చేస్తున్న ఆరోపణలలోనూ పస లేదనుకోవాలి. ప్రజలకి ఆసక్తి ఉన్న అటువంటి విషయాలను ప్రస్తావిస్తూ రాజకీయంగా తన ప్రత్యర్దులను విమర్శించడానికే ఉపయోగించుకొంటున్నారని భావించాల్సి ఉంటుంది. అయితే, ఇంతకీ జగన్ కేసు విషయంలో ఎవరి వాదన సరయినది అని తెలుసుకోవాలంటే ప్రజలే తమకు నచ్చిన రంగుటద్దాలు పెట్టుకొని చూసి తెలుసుకోవాలి.