83 పరుగులకే ఢిల్లీ ఆలౌట్

IPL 6 Chennai Super Kings crush Delhi Daredevils, IPL 2013 CSK inflict heavy defeat on Delhi Daredevils, IPL 6: CSK beat Delhi by 86 runs

 

సొంత గడ్డపై ఢిల్లీ డేర్ డెవిల్స్ 17.3 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఐపిఎల్-6 లీగ్ మ్యాచ్ లలో భాగంగా ఫిరోజ్ షా కోట్ల మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ X ఢిల్లీ డేర్ డెవిల్స్ తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఓపెనర్ మురళీ విజయ్ 18 పరుగుల వద్ద మోర్కెల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ మైక్ హస్సీ కి సురేష్ రైనా జతకలిశాడు. వీరిద్దరూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతూ చెన్నై ఇన్నింగ్స్ 10 ఓవర్లలో 60 పరుగులు చేసింది. పదో ఓవర్ తరువాత సురేష్ రైనా, మైక్ హస్సీ జూలు విదిలించారు. సురేష్ రైనా 32 బంతుల్లో 30 పరుగులు (3 ఫోర్లు) చేసిన తరువాత ఇర్ఫాన్ పఠాన్ వేసిన బంతిని బౌండరీకి తరలించే క్రమంలో వికెట్ కీపర్ జాదవ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రీజ్ లోకి రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మైక్ హస్సీ 50 బంతుల్లో 65 పరుగులు (6 బౌండరీలు 2 సిక్సర్లు) నాటౌట్, ధోని 23 బంతుల్లోనే 44 పరుగులు (5 బౌండరీలు 1 సిక్సర్) రెచ్చిపోయారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు 74 పరుగులు జోడించారు. ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగా ధోని భారీ సిక్సర్ కు ప్రయత్నించి ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో మెండిస్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరుకున్నాడు. బ్రేవో 3 రనౌట్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ 10 ఓవర్లలో 60 పరుగులు ఉండగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. ఇర్ఫాన్ పఠాన్ 1, మోర్నీ మోర్కెల్ 1, ఉమేశ్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ మొదట్లోనే తడబడింది. మోహిత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో విధ్వంసకర బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ (1)ను క్లీన్ బౌల్డ్, జునేజాను (2)ఎల్బీడబ్యూ గా పెవిలియన్ కు పంపించాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ మహేళ జయవర్థనే (2)ను మోరిస్ ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ కు పంపాడు. మరో వైపు వీరేంద్ర సెహ్వాగ్ (17)ఆచి తూచి ఆడుతూ మోహిత్ శర్మ బౌలింగ్ లో భారీ సిక్సర్ కొట్టబోయి బౌండరీ వద్ద డేవిడ్ హస్సీ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆ తరువాత కోలుకోలేకపోయింది. కేదార్ జాదవ్ ఒక్కడే 28 బంతుల్లో 31 పరుగులు (3బౌండరీలు) రాణించాడు. మిగతా బ్యాట్స్ మెన్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. జీవన్ మెండిస్ 12 రనౌట్, ఇర్ఫాన్ పఠాన్ 2, అగార్కర్ 3, మొర్నీ మోర్కెల్ 2, ఉమేశ్ యాదవ్ 1, నదీమ్ శ్రావణ్ 2 నాటౌట్ గా నిలిచాడు. చెన్నై బౌలింగ్ విభాగంలో మోహిత్ శర్మ 3, అశ్విన్ 2, ఆల్బీ మోర్కెల్ 1, క్రిస్ మోరిస్ 1, డ్వేన్ బ్రావో 1, జడేజా 1 వికెట్ పడగొట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ 86 పరుగుల భారీ తేడాతో ఢిల్లీ డేర్ డెవిల్స్ ను మట్టి కరిపించింది. బ్యాటింగ్ లో రాణించిన మైక్ హస్సీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆడిన ఆరు మ్యాచ్ లు కూడా ఓడిపోవడంతో నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలు పూర్తిగా దాదాపు తుడిచిపెట్టుకుని పోయినట్లే