ఏపీ ఇంటర్లో 62 శాతం ఉత్తీర్ణత
posted on Apr 23, 2015 5:45PM

ఆంధ్రప్రదేశ్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. విజయవాడ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ఫలితాలను విడుదల చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో మొదటిసారి విడుదల చేసిన పరీక్ష ఫలితాలివి. జనరల్‌లో 52 శాతం మందికి ‘ఎ’ గ్రేడ్ వచ్చింది. ఒకేషనల్‌లో 60 శాతం మందికి ‘ఎ’ గ్రేడ్ వచ్చింది. ఇంటర్మీడియట్ పరీక్షలకు 4,61,932 మంది విద్యార్థులు జనరల్ కేటగిరీలో హాజరవగా, 26,913 మంది ఒకేషనల్‌కి హాజరయ్యారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్‌లో 62.09 శాతం మంది విద్యార్థులు విజయం సాధించారు. గత సంవత్సరంతో పోల్చితే ఇది నాలుగు శాతం ఎక్కువ. మొత్తం ఫలితాలలో 76 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 59 శాతంతో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కాగా, జనరల్ కేటగిరీలో పరీక్ష రాసిన విద్యార్థులలో 79 మంది మీద, ఒకేషనల్ పరీక్ష రాసిన విద్యార్థులలో 12 మంది మీద.. మొత్తం 91 మంది మీద మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. పరీక్షలో ఫెయిలయిన విద్యార్థుల కోసం మే 25 నుంచి జూన్ 2 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి గంటా తెలిపారు.