భారత్ యాక్షన్ ప్లాన్ తో దారికొస్తున్న కెనడా

ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ బహిరంగ వివాదానికి ఆజ్యం పోసిన కెనడా .. తదనంతర పరిణామాల్లో భారత్ తీసుకుంటున్న చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ లో పనిచేస్తున్న 41 మంది దౌత్య సిబ్బందిని అక్టోబర్ 10లోపు ఉపసంహరించుకోవాలని కెనడాను భారత్ కోరడం తెలిసిందే. ఈ చర్యలను ఊహించని కెనడా, ఇప్పుడు ప్రైవేటు చర్చలను కోరుకుంటున్నట్టు ప్రకటించింది. నిజానికి హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో భారత్ తో ప్రైవేటుగానే చర్చించాల్సిన కెనడా, దీన్ని బహిర్గతం చేసి వివాదానికి కారణమైనట్టు నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. 
ద్వైపాక్షిక వివాదాన్ని పరిష్కరించుకోవడానికి భారత్ తో ప్రైవేటుగా చర్చలను కెనడా కోరుకుంటున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. రెండు దేశాల మధ్య రాయబార చానళ్లు తెరుచుకునే ఉన్నాయని, రెండు వైపులా సంప్రదింపులు కొనసాగుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కెనడాకు ఢిల్లీలో ఎంబసీ, చండీగఢ్, బెంగళూరు, ముంబై లో కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిల్లో 62 మంది వరకు పనిచేస్తున్నారు. వీరి నుంచి 41 మందిని ఉపసంహరించుకోవాలని భారత్ కోరింది. భారత్ తో వివాదాన్ని కోరుకోవడం లేదని, కలసి బాధ్యతగా పనిచేయాలని అనుకుంటున్నట్టు కెనడా ప్రధాని ట్రూడో సైతం ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News