కేసీఆర్ రాజకీయం కుటుంబం కోసమే.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఇదేనా?

ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్డీయే కూటమిలో చేరేందుకు ఆయన తహతహలాడారనీ, తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావును తెలంగాణ ముఖ్యమంత్రిని చేద్దామనుకుంటున్నాననీ ఆశీర్వదించాలనీ తనను కోరారనీ మోడీ బహిరంగ సభలో వెల్లడించారు. తెలంగాణ  ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం లోగా ఎప్పుడు అయినా వెలువడే అవకాశం ఉందన్న సమాచరం నేపథ్యంలో  ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం నిజామాబాద్ నిజామాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో  చేసిన ప్రసంగంతో ఆయన తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారనే చెప్పాలి. 

నెలల ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసేసి ఎన్నికలకు పూర్తి స్థాయిలో సంసిద్ధమైపోయినట్లు కనిపించిన బీఆర్ఎస్ ఆ తరువాత కారణాలేమైతేనేం ఎన్నికల సన్నాహకాలలో బాగా వెనుకబడిపోయింది. చంద్రబాబు అరెస్టు, కాంగ్రెస్ దూకుడు, అభ్యర్థుల జాబితా ప్రకటనతో పార్టీలో వెల్లువెత్తిన అసంతృప్తి ఇలా బీఆర్ఎస్ వెనుకబాటుకు చాలా చాలా కారణాలున్నాయి. 

ఇక తెలంగాణలో బీజేపీ పుంజుకున్నట్లే కనిపించి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తరువాత ఒక్కసారిగా చతికిల బడినట్లు కనిపించింది. దీంతో తెలంగాణలో పార్టీలో జోష్ నింపేందుకు ఆ పార్టీ సమాయత్తమైంది. అందులో భాగంగానే మూడు రోజుల వ్యవధిలో మోడీ తెలంగాణలో రెండు బహిరంగ సభలలో  ప్రసంగించి పార్టీ క్యాడర్ లో జోష్ నింపేందుకు ప్రయత్నించారు. అయితే కమలం పార్టీలో  అసమ్మగి భగభగలు చల్లారకపోవడం.. ప్రధాని మోడీ సభకు సైతం పలువురు సీనియర్లు డుమ్మా కొట్టడంతో రెండో సభలో ప్రధాని మోడీ తన ప్రసంగ వ్యూహం మార్చారు. అధికార పార్టీని బినీత్ ది బెల్ట్ కోట్టే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఆయన కుమారుడిని సీఎం చేయడం కోసం కేసీఆర్ అన్ని ప్రమాణాలనూ పక్కన పెట్టేయడానికి సిద్ధ పడ్డారనీ, ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా చేరేందుకు కూడా వెంపర్లాడారనీ వెల్లడించారు. సహజంగానే మోడీ ప్రసంగం తరువాత బీఆర్ఎస్ లో తీవ్రమైన చర్చ ప్రారంభమైంది. కేటీఆర్ మోడీ చెప్పినవి అబద్ధాలంటూ విరుచుకుపడ్డారు. బీజేపీని జుమ్లా పార్టీగా అభివర్ణించారు. 

అయితే ప్రధాని మోడీ మాత్రం పక్కా వ్యూహంతోనే నాలుగేళ్ల కిందట కేసీఆర్ తనతో చర్చించిన వివరాలను సరిగ్గా ఎన్నికల వేళ వెల్లడించి బీఆర్ఎస్ గుక్కతిప్పుకోలేకుండా చేశారు.  కేసీఆర్ హస్తిన వెళ్లిన ప్రతి సారి ప్రధాని మోడీని కలిసి తెలంగాణ అభివృద్ధి, ప్రగతి, పురోగతి వినా మరో విషయమే మాట్లాడేవారు కాదంటూ ఇంత కాలం గొప్పగా చెప్పుకున్న బీఆర్ఎస్.. మోడీతో కేసీఆర్ విభేదించడానికి కారణం కూడా తెలంగాణకు ఆయన ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేస్తున్నందునే అని చెబుతూ వచ్చారు. ఇప్పుడు మోడీ కేసీఆర్ రాష్ట్ర ప్రగతి గురించి కాకుండా, తన కుమారుడి ప్రమోషన్ కోసమే హస్తినలో కేంద్ర పెద్దలతో భేటీ అయ్యేవారిని మోడీ స్వయంగా చెప్పడం వారిని కంగుతినిపించింది. 
వాస్తవానికి కేటీఆర్ ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించిన క్షణం నుంచీ ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చో పెట్టేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పార్టీ శ్రేణులు చెబుతూ వస్తున్నాయి. కేటీఆర్ కు పదోన్నతికి అడ్డుపడే అవకాశం ఉందన్న భావనతోనే  2018 ఎన్నికలలో విజయం తరువాత కేసీఆర్ తొలి కేబినెట్ లో హరీష్ రావు, ఈటల వంటి వారికి చోటుదక్కలేదు. ఆ తరువాత మారిన పరిస్థితుల కారణంగా వారిరువురికీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చోటు కల్పించినప్పటికీ.. వారి ప్రాధాన్యతను గణనీయంగా తగ్గించారు. ఇక ధిక్కార స్వరం వినిపించిన ఈటలను పార్టీ నుంచే సాగనంపారు. ఇప్పుడు తన కుమారుడిని సీఎం చేయాలనుకుంటున్నాను మీ ఆశీర్వాదం కావాలంటూ కేసీఆర్ తనను కోరారని మోడీయే స్వయంగా చెప్పడంతో.. కేసీఆర్ డిఫెన్స్ లో పడ్డారు. మోడీ చెప్పినవన్నీ అబద్ధాలని కేటీఆర్ ప్రకటించినంత మాత్రాన సరిపోదు. మోడీ మాటలు వాస్తవం కాదని కేసీఆర్ స్వయంగా చెప్పాలి. వివరణ ఇవ్వాలి. అయితే ఇంత వరకూ అయితే కేసీఆర్ నుంచి ఎటువంటి ఖండనా, కనీసం స్పందనా రాలేదు.  దీంతో బీఆర్ఎస్ శ్రేణులలో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు, అసలు అవుతారా? అవ్వరా అన్నఉత్కంఠ మొదలైంది. మద్యం కుంభకోణం నుంచి కవితను కాపాడుకోవడం కోసమే కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కార్, మోడీపై విమర్శల దాడిని పూర్తిగా తగ్గించేశారన్న అనుమానాలు ఇప్పటికే తెలంగాణ సమాజంలో బలంగా ఉన్నాయి. ఇప్పుడు మోడీ కేసీఆర్ నాలుగేళ్ల కిందటే తనకు దాసోహం అన్నారనీ, తానే ఆయన ఎన్డీయేలో చేరుతానన్న ప్రతిపాదనను తిరస్కరించాననీ చెప్పడంతో కేసీఆర్ జాతీయ ఆకాంక్షలపైనే తెలంగాణ ప్రజలలో  అనుమానాలు మొదలయ్యాయి. కేసీఆర్ మౌనం ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చేదిగా ఉంది.  

ముఖ్యంగా కేటీఆర్ ను  ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నానంటూ కేసీఆర్ తనతో స్వయంగా చెప్పి కుమారుడిని ఆశీర్వదించాలని కోరిట్లు మోడీ వెల్లడించడంతో కేసీఆర్ తర్వాత సీఎం అయ్యేది కేటీఆర్ మాత్రమేనని ప్రజల్లో, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికే  ఉన్న ప్రరాన్ని మోడీ వ్యాఖ్యలు ధృవీకరించాయి. అయితే అందు కోసం ఎన్‌డీఏ కూటమిలో చేరడానికి కూడా కేసీఆర్ సిద్ధమయ్యారన్న మోడీ మాటలు బీఆర్ఎస్ కు గట్టి షాక్ గానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.