గోల్కొండ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రులు
posted on Jun 26, 2025 4:37PM

హైదరాబాద్‌లో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లంగర్‌హౌస్ చౌరస్తాలో గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వ తరుపున పట్టు వస్త్రాలను మంత్రి కొండా సురేఖ, బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్ సమర్పించారు. మంత్రి కొండా సురేఖ అమ్మవారికి తొలి బోనం నేవేద్యంగా ఇచ్చారు. మరోవైపు.. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కూడా బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు.
గోల్కొండ జగదాంబిక మహంకాళి, ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు.ఈ బోనాలు జూలై 24వ తేదీ వరకు గురు, ఆదివారాల్లో కొనసాగనున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దీనిని అధికారిక పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ యేడాది బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.