వైభవంగా బోనాలు..అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు
posted on Jul 20, 2025 11:39AM

హైదరాబాద్ నగరంలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టువస్త్రాలు సమర్పించారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నాట్లు మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అటు కార్వాన్ క్రాస్‌లోని దర్బార్ మైసమ్మ తల్లిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు.
అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది.
ఆలయం వద్ద నాలుగు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చేవారి కోసం ప్రత్యేక క్యూలైన్ అందుబాటులో ఉంచారు. 1200 మంది పోలీసులు, 10 షీ టీమ్స్‌తో ఆలయం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 2 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.