గుండె కొట్టుకోవడంలో తేడా ఉండాల్సిందే!


 

శ్వాస తీసుకునే విధానానికీ ఆరోగ్యానికీ మధ్య ఉన్న సంబంధం మనకి తెలియనిది ఏమీ కాదు. కేవలం శ్వాస తీసుకునే పద్ధతిని నియంత్రించేందుకే భారతీయులు ప్రాణాయామాన్ని కనుగొన్నారన్న విషయం తెలిసిందే! ప్రాణాయామం ద్వారా శ్వాస మీద అదుపు సాధిస్తే కనుక ఊపిరితిత్తుల నుంచి గుండె వరకూ మన శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయనీ... తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందనీ మన పెద్దల నమ్మకం. ఇదే విషయాన్ని మరోసారి మరో పరిశోధన రుజువు చేసింది.

 

మ్యూనిచ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన జార్జ్‌ ష్మిట్‌ అనే పరిశోధకులు అందిస్తున్న ఈ నివేదిక గుండె కొట్టుకోవడానికీ, ఆయుష్షుకీ ప్రత్యక్ష సంబంధం ఉందని చెబుతోంది. తన పరిశోధన కోసం జార్జ్ 950 మంది గుండె పోటు వచ్చిన రోగులను ఎంచుకున్నారు. వీరందరి గుండె పనితీరునీ కూడా ఐదేళ్ల పాటు నిశితంగా గమనించారు. సాధారణంగా ఒక వ్యక్తి ఊపిరి పీల్చుకునేటప్పుడు ఒకలా, శ్వాసను విడిచేటప్పుడు మరోలా అతని గుండె కొట్టుకుంటుంది. ఈ వ్యత్యాసాన్ని ‘Respiratory sinus arrhythmia’ అంటారు. తాము గమనించిన కొందరు రోగులలో ఈ వ్యత్యాసం పెద్దగా లేకపోవడాన్ని గమనించారు జార్జ్‌. అంటే సదరు రోగుల గుండె నిరంతరం ఒకే తీరున కొట్టుకుంటోందన్న మాట! చూడ్డానికి ఇది చాలా ఆరోగ్యకరమైన విషయంలా తోచవచ్చు. కానీ గుండె ఇలా ఒకే తీరున కొట్టుకునే రోగులు త్వరలోనే చనిపోవడాన్ని గమనించారు జార్జ్‌. అలా కాకుండా కొద్దిపాటి వ్యత్యాసంతో గుండె కొట్టుకునే రోగులు సుదీర్ఘకాలం జీవించినటట్లు తేలింది. ఇలా ఉఛ్వాస నిశ్వాసల మధ్య గుండె పనితీరులో కొద్దిపాటి మార్పు కనిపించడమే ఆరోగ్యకరమంటున్నారు జార్జ్‌. బహుశా గుండె విశ్రాంతి తీసుకోవడానికీ, తన పనితీరుని మెరుగుపరచుకోవడానికే ఇలాంటి వ్యత్యాసం ఉపయోగపడుతుందని పరిశోధకులు అనుమానిస్తున్నారు.

 

తను చేసిన పరిశోధన ఆధారంగా ఎవరైనా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చునంటున్నారు జార్జ్‌. ముఖ్యంగా గుండె వ్యాధి ఉన్నవారు, తమ గుండె కొట్టుకునే విధానాన్ని అప్పుడప్పుడూ గమనించుకోవాలని సూచిస్తున్నారు. వైద్యుల సాయంతో తమలోని ‘Respiratory sinus arrhythmia’ తగిన వ్యత్యాసంతో ఉందా లేదా బేరీజు వేసుకోవాలని చెబుతున్నారు. ఇందులో అకస్మాత్తుగా ఏదన్నా తేడా కనిపిస్తే నిపుణులను సంప్రదించమని హెచ్చరిస్తున్నారు.

 

-నిర్జర.