ఏపీలో ఘోర రైలు ప్రమాదం..27 మంది దుర్మరణం
posted on Jan 22, 2017 8:39AM

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జగదల్‌పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ అర్థరాత్రి సమయంలో విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 27 మంది మరణించగా..దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు..వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని బోగీలను కట్ చేసి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వారు అధికారులను ఆదేశించారు.