తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు స్పీడ్ బ్రేక్
posted on Jul 31, 2014 3:22PM
.jpg)
చాలా దూకుడుగా సాగుతున్న తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు నిన్న బ్రేకులు వేసింది. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణాలో ప్రవేశించే వాహనాలపై ప్రవేశపన్ను విదిస్తూ తెలంగాణా ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీఓ నెంబర్:43ను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషనుపై స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ (రాష్ట్ర విభజన) బిల్లులో సూచించిన విధంగా వచ్చే సంవత్సరం మార్చి 31వరకు ఆంద్రప్రదేశ్ నుండి తెలంగాణా రాష్ట్రంలో ప్రవేశించే వాహనాలపై ఎటువంటి కొత్త పన్నులు విదించరాదని స్పష్టం చేసింది. తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన జీఓ అమలుకాకుండా నిలిపివేసింది. ఇరు రాష్ట్రాలు విభజన బిల్లులో పేర్కొన్న అంశాలకు కట్టుబడి ఉండాలని కోర్టు మెత్తగా చురకలు కూడా వేసింది.
ఇది తెలంగాణా ప్రభుత్వానికి చాలా అవమానకరమయిన విషయమేనని చెప్పవచ్చును. ఈ అంశంపై విభజన బిల్లులో చాలా స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, దానిని పట్టించుకోకుండా ముందుకు సాగినందునే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చును. గతంలో కూడా ప్రభుత్వాలు విడుదల చేసిన అనేక జీఓలపై కోర్టులు స్టే విదించినా అప్పటి పరిస్థితులు వేరు గనుక ప్రభుత్వాలు దానిని అవమానకరంగా భావించేవి కావు. కానీ ఇప్పుడు తనకు తిరుగే లేదని భావిస్తున్న తెలంగాణా ప్రభుత్వం, తను జారీ చేసిన జీఓను కోర్టు నిలిపివేయడం చాలా అవమానకరమేనని చెప్పక తప్పదు. అందువల్ల ఇకనైనా విభజన బిల్లులో పేర్కొన్న షరతులకు లోబడి నిర్ణయాలు తీసుకొంటే ఇటువంటి అవమానకర పరిస్థితి ఎదుర్కోవలసిన అవసరం ఉండదు.