హైకోర్టు విభజనపై ప్రధాన న్యాయమూర్తుల భిన్నాభిప్రాయం

 

తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు కోసం తెలంగాణా ప్రభుత్వం ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ కూడా సానుకూలంగా స్పందిస్తూ, తెలంగాణా ప్రభుత్వం హైకోర్టు కి అవసరమయిన భవనాలు, ఇతర సదుపాయాలూ కల్పించినట్లయితే రెండు నెలలలోగానే హైకోర్టు ఏర్పాటయ్యేలా చేస్తానని హామీ ఇచ్చేరు. తెలంగాణా ప్రభుత్వం కూడా తక్షణమే స్పందిస్తూ గచ్చిబౌలీ వద్ద 1.09 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనం సిద్దంగా ఉందని కేంద్రమంత్రికి లిఖిత పూర్వకంగా తెలియజేసింది. తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటుచేయమని కోరుతూ తాను త్వరలోనే సుప్రీంకోర్టుకి లేఖవ్రాస్తానని సదానంద గౌడ రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చేరు.

 

కానీ సరిగ్గా అదే సమయంలో ఒక పిటిషనుపై స్పందిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే హైకోర్టు ఏర్పాటు చేయవలసి ఉంది గానీ తెలంగాణాకి కాదని, ఒకవేళ అలాగా చేయదలచుకొంటే అది చట్ట విరుద్దం అవుతుంది కనుక చట్టంలో సెక్షన్ 31ని సవరించవలసి ఉంటుందని తేల్చి చెప్పింది. అంతేకాక కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ హైకోర్టు విభజన చేస్తానని తెలంగాణా ప్రభుత్వానికి హామీ ఇవ్వడాన్ని కూడా తప్పు పట్టింది. అంతేకాక వారి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను అన్నిటినీ తన ముందు ఉంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. హైకోర్టు విభజన కోరుతూ న్యాయవాదులు ఆందోళనలు చేయరాదని హితవు పలుకుతూనే చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఎంత మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించింది కూడా.

 

కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హెచ్.యల్. దత్తు తనను కలిసిన తెలంగాణా జేయేసీ నేతలతో మాట్లాడుతూ, తెలంగాణా ప్రభుత్వం హైకోర్టు కోసం భవనాలు, అవసరమయిన ఇతర మౌలిక వసతులు అన్నీ కల్పించినట్లయితే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా సాగుతున్న ప్రస్తుత హైకోర్టును విభజించి తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేందుకు అవసరమయిన ప్రక్రియ ఆరంభిస్తామని హామీ ఇచ్చేరు.

 

ఈవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటుపై పరస్పర విరుద్దంగా స్పందించడం చూస్తే ఈ ప్రక్రియ ఏవిధంగా ముగుస్తుందోననిపిస్తుంది. అయితే హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నవిధంగా తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేసేందుకు విభజన చట్టంలో ఉన్న అవరోధాలను తొలగించేందుకు చట్ట సవరణలు చేయవలసి ఉంటుందేమో?