సీతయ్య ఎవరి మాట వినడు

 

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు కట్టుబడి ఉన్నానని చెపుతుంటే ఆ పార్టీకి చెందిన సీమంధ్ర నేతలు మాత్రం సమైక్యాంధ్ర కోరుతూ పోటాపోటీగా నిరాహారదీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు హరికృష్ణ కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా చంద్రబాబుకి పోటీగా బస్సుయాత్ర కూడా చెప్పట్టబోతున్నారు. చంద్రబాబు పార్టీని రెండు ప్రాంతాలలో కాపాడుకోవాలనే ఆలోచనతో బస్సుయాత్ర చెప్పట్టబోతుంటే, హరికృష్ణ సమైక్యాంధ్ర కోసం చేయబోతున్న బస్సుయాత్రతో చంద్రబాబుకి, తెదేపాకి ఇబ్బందులు సృష్టించబోతున్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నపటికీ, నందమూరి కుటుంబానికి చెందిన హరికృష్ణ బస్సుయాత్ర చేపడితే అది తెలంగాణా ప్రజలకి, నేతలకి తప్పుడు సంకేతాలు పంపుతుంది. అదేవిధంగా కాంగ్రెస్, వైకాపా, తెరాసలకు ఒక తెదేపాపై దాడి చేసేందుకు ఒక చక్కటి ఆయుధం అందజేసినట్లవుతుంది. పార్టీ అధిష్టానాన్ని సంప్రదించకుండా ఆయన ఈ విధంగా బస్సు యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించడం పార్టీని డ్డీకొనడంగానే భావించవచ్చును.

 

కొద్ది నెలల క్రితం వైకాపా ఫ్లెక్సీ బ్యానర్లతో చిచ్చుపెట్టినప్పుడు, తన కుమారుడు జూ.యన్టీఆర్ తో చంద్రబాబు, బాలకృష్ణలు వ్యవహరించిన తీరుపట్ల చాలా ఆగ్రహంగా ఉన్నహరికృష్ణ, ఇప్పుడు సరయిన సమయం చూసి చంద్రబాబుపై పగ తీర్చుకొనేందుకే ఈ సమైక్యాంధ్ర బాట పట్టి ఉండవచ్చును. ఒకవేళ చంద్రబాబు ఆయన బస్సు యాత్రకి అడ్డుపడితే తెదేపా సమైక్యాంధ్రని వ్యతిరేఖిస్తున్నట్లవుతుంది. చూసీచూడనట్లు ఊరుకొంటే, తెలంగాణాను వ్యతిరేఖిస్తున్నట్లు ప్రచారం అవుతుంది. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నహరికృష్ణ హటాత్తుగా తన పదవికి రాజీనామాచేసి బస్సు యాత్రలు చేపట్టినంత మాత్రాన్న ప్రజలు ఆయన మాటలను నమ్మకపోవచ్చును, కానీ స్వయంగా నందమూరి కుటుంబ సభ్యుడే తెలంగాణాను వ్యతిరేఖిస్తున్నందున అది పార్టీ అభిప్రాయమేనని ప్రతిపక్షాలు ప్రచారం చేసుకొనే అవకాశాన్ని చేజేతులా అందజేసినట్లవుతుంది. మరి హరికృష్ణ వ్యవహార శైలితో మొదటినుండి తీవ్ర ఇబ్బందులు పడుతున్న చంద్రబాబు, బాలకృష్ణలు మరిప్పుడు ఆయనని ఏవిధంగా నిలువరిస్తారో చూడాలి.