ప్రత్యేక హోదాపై నిప్పు రాజేస్తున్న కాంగ్రెస్ నేతలు

 

‘ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దంటూ’ నల్గొండ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాని మోడీకి వ్రాసిన లేఖపై ఆంధ్రా, తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఊహించినట్లే యుద్ధం మొదలుపెట్టారు. మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ గుత్తా లేఖను తప్పు పట్టారు. కానీ అది ఆయన వ్యక్తిగతమని చెప్పి ఈ వ్యవహారంలో గుత్తా ఏవిధంగా స్పందించాలో చెప్పకనే చెప్పారు. జైరామ్ రమేష్ అందించిన ఆ ‘హింట్’ ని గుత్తా వెంటనే క్యాచ్ చేసి, ఆ లేఖ పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేయజేస్తోందే తప్ప దానితో పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించేశారు. ఒక్క రాజధాని మినహా ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల స్థితిగతులలో ఎటువంటి తేడా లేదని, తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలోనే అభివృద్ధి బాగా జరిగిందని కనుక ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణాలో ఉన్న పరిశ్రమలు కూడా అక్కడికి తరలిపోతాయనే ఆలోచనతోనే వ్యతిరేకించాను తప్ప తనకి వేరే ఉద్దేశ్యం లేదని చెప్పారు. ఒకవేళ ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చేమాటయితే తెలంగాణాకు కూడా ఇవ్వాలని కోరానని ఆయన చెప్పారు. అవ్వ పేరే బామ్మ బామ్మ పేరే అవ్వ అన్నట్లుగా ఉంది ఆయన మాటలు వింటుంటే. ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వవద్దని కోరినా లేక తెలంగాణకు కూడా ఇవ్వాలని కోరినా దాని వలన అంతిమంగా నష్టం జరిగేది మాత్రం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే. పార్లమెంటులో ప్రధాని హామీ ఇచ్చిన తరువాత కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు, తెలంగాణాకు కూడా ఇస్తే తప్ప ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వరాదనే కొత్త మెలిక పెడితే ఇక అది సాధ్యమయ్యే పనేనా?

 

గుత్తాది వ్యక్తిగత అభిప్రాయామని సాక్షాత్ కాంగ్రెస్ అధిష్టానానికి ప్రతినిధి అయిన జైరామ్ రమేషే తేల్చిపడేసిన తరువాత ఇంకా దానిపై చర్చ అనవసరమనే అనుకోవాలి. కానీ మాజీ మంత్రి కొండ్రు మురళి మోహన్ ఈ వ్యవహారంపై యుద్ధం కొనసాగిస్తూ, “ఇంతకాలం ఎంతో బలంగా ఉన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుత్తా వంటి కాంగ్రెస్ నేతల కారణంగానే రెండుగా విడిపోయింది. సోనియా గాంధీ అటువంటి వారి మాటలు నమ్మి రాష్ట్రాన్ని విడదీసినందుకు కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో సర్వ నాశనమయింది. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ పార్టీని బ్రతికించుకోవాలని మేము విశ్వప్రయత్నాలు చేస్తుంటే గుత్తా వంటివారు మధ్యలో ఇటువంటి పుల్లలు పెట్టి పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారు” అని ఆరోపించారు.

 

బహుశః గుత్తా, ఆయనతో బాటు మరి కొందరు తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా కలిసి ఆయనకు ధీటుగా జవాబు చెప్పవచ్చును. ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణాకు కూడా తప్పనిసరిగా ఇవ్వాలని వాదన తెర పైకి తెచ్చినా ఆశ్చర్యం లేదు. దానికి మళ్ళీ ఆంధ్రా కాంగ్రెస్ నేతలు ఏదో చెప్పవచ్చును. కానీ వారిరువురి వాదోపవాదనల వలన హానీ జరిగేది మాత్రం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే! కాంగ్రెస్ నేతలు కేవలం తమ పార్టీని ఏవిధంగా బ్రతికించుకోవాలనే ఆలోచిస్తున్నారు తప్ప రాష్ట్ర విభజనతో ఘోరంగా దెబ్బ తిన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏవిధంగా నిలబెట్టుకోవాలనే ఆలోచన మాత్రం చేయకపోవడం చాలా దురదృష్టకరం. “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకొనేందుకు తామంతా కష్టపడుతుంటే...”అనే కొండ్రు మురళి మాటలే ప్రత్యేక హోదా అంశాన్ని వారు ఎందుకు, ఏవిధంగా ఉపయోగించుకొంటున్నారో తెలియజేస్తోంది. దానికి గుత్తా వంటి నేతలు ఆజ్యం పోసి మంట రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం చాలా నిజాయితీగా పోరాడుతున్నామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ అధిష్టానం దీనిపై తన స్వంత పార్టీ నేతలే కొత్త సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తుంటే, తక్షణమే స్పందించకుండా నిర్లిప్త వైఖరి ప్రదర్శించడాన్ని ఏమని భావించాలి?