మరోసారి వివాదాల సుడిలో గుమ్మనూరు!

గుంతకల్లు తెలుగుదేశం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరోసారి వివాదాల సుడిలో చిక్కుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు   తీవ్ర దుమారం రేపుతున్నాయి. నియోజకవర్గ తెలుగుదేశం సంస్థాగత కమిటీల నియామకానికి సంబంధించి గుంతకల్లులోని ఓ కళ్యాణమండపంలో మూడు రోజుల కిందట నిర్వహించిన సమావేశంలో గుమ్మనూరు జయరాం మాట్లాడారు.  ఆ సందర్భంగా  ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ శ్రేణులంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేయాలని, లేదంటే వారి తోక కత్తిరించి సున్నం పెడతామని హెచ్చరించారు. అలాగే వైసీపీ తరపున ఎవరూ నామినేషన్లు వేయకుండా చూడాలని తెలుగుదేశం కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

 వైసీపీ నేతలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే రెడ్ బుక్  ఓపెన్ చేస్తానన్నారు. కాగా..  ప్రజాస్వామిక హక్కులు కాలరాసేలా మాట్లాడిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై చర్యలు తీసుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు ప్రజలు తోక కోసి సున్నం పెడితేనే జయరాం  గుంతకల్లుకు వలస వచ్చి... చంద్రబాబు దయతో ఎమ్మెల్యే అయ్యారని వారు ఎద్దేవా చేశారు. గుంతకల్లు, గుత్తి, పామిడి మండలాల్లో తన కుటుంబీకులను సామంత రాజుల్లా పెట్టుకుని జయరాం పలు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాగే వ్యవహరిస్తే జిల్లా ప్రజలు కూడా ఆయనను తరిమి కొడతారని హెచ్చరించారు. 

కాగా, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గుమ్మనూరు జయరాం కు ఇదే మొదటి సారి కాదు. తనపై ఆధారాల్లేకుండా వార్తలు రాసే జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద దుమారమే రేపాయి. జర్నలిస్టు సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో పార్టీ పెద్దలు జోక్యం చేసుకొని ఆయన చేత వివరణ ఇప్పించాల్సి వచ్చింది. దీంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది. అయినా, ఆయనలో మార్పు రాలేదని ప్రస్తుత వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. గతంలో వైసీపీ తరపున ఆలూరు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పలుమార్లు తన నోటి దురుసు ప్రదర్శించారు. టీడీపీలోకి వచ్చాక కూడా ఆయన అదే పద్ధతిలో మాట్లాడుతూం డడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజానికి ఎన్నికల ముందు ఆయనను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనికి కారణం టీడీపీ అధినేతను, లోకేశ్ ను గతంలో ఆయన తీవ్ర పదజాలంతో దూషించి ఉండడమే. ప్రత్యర్థుల చేత నామినేషన్లు కూడా వేయనివ్వకుండా స్థానిక ఎన్నికలను గత వైసీపీ ప్రభుత్వం ఏకపక్షం చేసిన విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu