బంగారం ధరలు ఢ‌మాల్?.. కారణం ఏంటో తెలుసా?

ల‌క్ష క్రాస్ అయిన‌ట్టు క‌నిపించిన బంగారం ధ‌ర‌లు అనూహ్యంగా యాభై నుంచి డెబ్బై వేల‌కు ప‌డిపోనున్నాయా? అన్న‌ది డిబేట్ గా మారిందిప్పుడు. కొన్ని సంస్థ‌లు కూడా బంగారం ధ‌ర‌లు త‌గ్గు ముఖం ప‌ట్టే ఛాన్సుంద‌ని చెబుతున్నాయి. కార‌ణాలేంట‌ని చూస్తే..   ర‌ష్యా- ఉక్రెయిన్ త‌ప్ప పెద్ద గొప్ప‌గా.. యుద్ధాలేవీ లేవు. ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, హ‌మాస్ వంటి ఘ‌ర్ష‌ణ‌లు త‌గ్గు ముఖం పట్టాయి. అంతే  కాదు భార‌త్- పాక్ మ‌ధ్య గొడ‌వ కూడా స‌ద్దు మ‌ణిగింది. కాబ‌ట్టి యుద్ధ వాతావ‌ర‌ణం లేన‌పుడు ఆటోమేటిగ్గా బంగారం  ధ‌ర‌లు దిగి వ‌స్తాయి.  

 ఆప‌రేష‌న్ సిందూర్ టైంలో.. బీజేపీ  నేత అన్నామ‌లై ఒక మాట అన్నారు గుర్తుందా? దేశం సుర‌క్షితంగా ఉంటేనే మ‌న‌మూ మ‌న ఇళ్లూ వాకిళ్లూ ఇత‌ర ఆస్తులు నిలిచి ఉంటాయి. అదే దేశం నిత్యం యుద్ధాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతుంటే.. ఆటోమేటిగ్గా మ‌న ఆస్తులు అంత‌స్తులు అన్నీ నాశ‌న‌మై పోయి.. మ‌నం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చేస్తానని అన్నారాయ‌న‌. ఈ మాట‌ల్లో ఎంతో అర్ధం ఉంద‌ని అంటారు నిపుణులు. అప్ప‌ట్లో ఇరాన్ ఇజ్రాయెల్లో ఇంట‌ర్నెట్ లేక చాలా వీడియోల‌ను మ‌నం చూడ‌లేక పోయాం కానీ ఇప్పుడిప్పుడే ఈ రెండు దేశాల్లో ఎంత‌టి విధ్వంసం జ‌రిగిందో తెలిపేలాంటి వీడియోలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కొస్తున్నాయి. ఇపుడీ ఆస్తుల‌న్నీ నిర‌ర్ధ‌క ఆస్తుల‌య్యాయి. 

స‌రిగ్గా యుద్ధాల‌పుడు ఇన్వెస్టర్లు.. ఇలాంటి స్థిరాస్తుల మీద , షేర్ల మీద‌గానీ పెట్టుబ‌డులు పెట్ట‌డానికి బ‌దులు బంగారం మీద మ‌దుపు చేస్తే అది శాశ్వతంగా ఉంటుంద‌ని భావిస్తారు. దీంతో బంగారం డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుంది. త‌ద్వారా.. బంగారం ధ‌ర‌లు అమాంతం పెరుగుతాయి. యుద్ధాల‌కూ స్టాక్ మార్కెట్ల‌కు కూడా అంతే లింకు ఉంటుంది. మీరు కావాలంటే చూడండి.. భార‌త్ పాక్ మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ స‌మ‌యంలో పాక్ స్టాక్ మార్కెట్ కి సంబంధించి ఏకంగా 80 వేల కోట్ల మేర సంప‌ద ఆవిరైంది. దీంతో ఆ దేశం దివాలా తీసి.. ఐఎంఎఫ్ ని అడుక్కోవ‌ల్సి వ‌చ్చింది. ఇలా యుద్ధాలు, రాజ‌కీయ అనిశ్చితి, ద్ర‌వ్యోల్బ‌ణ స‌మ‌యాల్లో బంగారానికి గిరాకీ ఎక్కువ అవుతుంది. త‌ద్వారా.. వీటి రేట్లు పెరుగుతుంటాయి. ఒక్కోసారి ఇన్వెస్ట‌ర్లు చౌక‌గా ఉన్న బంగారాన్ని విప‌రీతంగా కొనేసి.. కృత్రిమ  కొర‌త  సృష్టిస్తారు. ఆపై ధ‌ర‌లు ఒక్క‌సారిగా ఆకాశాన్ని అంటుతాయి. దీంతో త‌మ ద‌గ్గ‌రున్న బంగారం అధిక ధ‌ర‌ల‌కు అమ్మేస్తుంటారు. ఇలా బంగారం చుట్టూ ఎంతో మార్కెట్ మాయాజాలం న‌డుస్తూ ఉంటుంది. అందులో భాగంగా చూస్తే ప్ర‌స్తుతం ప్రపంచ‌మంతా ప్ర‌శాంతంగా ఉంది  కాబ‌ట్టి బంగారం ధ‌ర‌లు నేల‌మీద‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నా వేస్తున్నాయి కొన్ని గోల్డ్ రేటింగ్ కంపెనీలు. 

దానికి తోడు భార‌త్ లో ఆషాడమాసంలో డిమాండ్ బాగా త‌క్కువ ఉంటుంది. ఈ జూలైలో బంగారం ధ‌ర 70 వేల‌ రూపాయలకు ప‌డిపోయినా  ఆశ్చ‌ర్యం లేదంటున్నారు. ఇప్ప‌టికే 18 కేరెట్ల బంగారం 73 వేల ప‌లుకుతోంది. ఇక 22 కేరెట్లు సుమారు 89  వేలు, 24 కేరెట్ల బంగారం 97 వేల రూపాయల పై చిలుకు ప‌లుకుతోంది. జూన్ 28 నుంచి జూలై 1 మ‌ధ్య కాలంలో బంగారం ధ‌ర ప‌డిపోయింది. దీంతో ఇది ల‌క్ష లోపున‌కు వ‌చ్చేసింది. అందుకే అంటోంది.. ఈ డిమాండ్ స‌స్లై  చైన్ లో బంగారం ధ‌ర‌లు ఇలా హెచ్చు త‌గ్గుల‌కు లోన‌వుతున్నాయ‌ని.  అంతే కాదు  బ్యాంకుల వ‌డ్డీలు, అమెరికా ఫైనాన్షియ‌ల్ డేటాలు, యూఎస్- చైనా మ‌ధ్య ఒప్పందాలు, ఆపై గ‌నుల్లో త‌వ్వ‌కాల త‌గ్గుద‌ల వంటివి కూడా బంగారం ధ‌ర‌ల హెచ్చు తగ్గుల‌ను శాసిస్తుంటాయ‌ని అంటారు మార్కెట్ నిపుణులు. కాబ‌ట్టి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసే ముందు.. ఎవ‌రైనా నిపుణుల‌ను అడిగి  పెట్టుబ‌డులు పెడుతుండాలి. సో బీ అవేర్ ఆఫ్ ఇట్ అంటారు గోల్డ్ మార్కెట్ ఎక్స్ ప‌ర్ట్స్.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu