మాకు అప్పుడే అర్థమైంది.. ఆ బాధ్యత వైసీపీదే: గల్లా

 

గత ఐదేళ్లలో ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు టీడీపీ ఎంతగానో పోరాడిందని ఆ పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ అన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. హోదాపై మాట తప్పినందుకే రాష్ట్రంలో బీజేపీ అడ్రెస్ గల్లంతైందన్నారు. టీడీపీ ప్రత్యేకహోదా సాధించలేదని భావించిన ప్రజలు.. వైసీపీకి ఒక్క అవకాశం ఇచ్చారని చెప్పారు. ప్రధానితో భేటీ అయిన ప్రతిసారీ హోదా ప్రస్తావన తెస్తానని సీఎం జగన్‌ చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వకూడదని ప్రధాని స్పష్టంగా ఉన్నారనే విషయం తమకు అప్పుడే అర్థమైందని జయదేవ్‌ వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రానికీ హోదా ఇచ్చే అంశం పరిశీలనలో లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.  ఏపీ ప్రజలు వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని.. ప్రత్యేక హోదా సాధించాల్సిన బాధ్యత ఇప్పుడు ఆ పార్టీపై ఉందన్నారు. 

రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలను విలీనం చేయడాన్ని లోక్‌సభలో గల్లా ప్రస్తావించారు. స్వతంత్ర సంస్థలను ఉపయోగించుకుని బీజేపీ బెదిరింపు రాజకీయాలు చేస్తోందని జయదేవ్‌ ఆరోపించారు. ‘అందరూ బీజేపీలో చేరడమే ఆ పార్టీ చెబుతున్న సబ్‌కా వికాస్‌కు అర్థమా?’ అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ.. ఎమర్జెన్సీని తలపిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ విధానానికి అడ్డుకట్ట వేయకపోతే దేశ సమగ్రత, స్వతంత్రకు ముప్పు తప్పదన్నారు.