డయాబెటీస్‌ ఉంటే పండ్లు తినవచ్చా!

 

డయాబెటీస్‌ ఉన్నవారు పండ్లకి ఆమడ దూరంలో ఉంటారు. మహా అయితే నేరేడు పండ్ల సీజన్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే చక్కెర వ్యాధి ఉన్నవారు నేరేడు పండు తప్ప మరే పండు తిన్నా తేడా వస్తుందేమో అన్న భయం వారిది. నిజానికి మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలను అతి చవకగా, అతి సహజంగా అందించే బాధ్యత పండ్లది. అలాంటి పండ్లని పూర్తిగా దూరం పెట్టడం వల్ల, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. మరి డయాబెటీస్‌ ఉన్నవారు ఎలాంటి పండ్లను, ఏ రకంగా తీసుకోవాలో నిపుణులు చెబుతున్న మాటలను ఓసారి చూద్దాం...


ఎలాంటి బెర్రీలైనా!  స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు... ఇలా రకరకాల బెర్రీ పండ్లు ఇప్పుడు మనకి కూడా అందుబాటులో ఉంటున్నాయి. వీటిని నిస్సంకోచంగా తీసుకోవచ్చంటున్నారు వైద్యులు. వీటిలో ఉండే చక్కెర ఒక్కసారిగా రక్తంలోకి చేరుకోదనీ, కాబట్టి వీటిని తినవచ్చనీ సూచిస్తున్నారు. పైగా ఈ బెర్రీలలో ఉండే రకరకాల విటమిన్ల వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది కూడా.


నారింజ: చక్కెరవ్యాధిగ్రస్తులకు ఇష్టమైన పండు నారింజేనేమో! తీపి కంటే పులుపే ఎక్కువగా ఉండే నారింజతో శరీరానికి కావల్సిన ‘C’ విటమిన్‌ పుష్కలంగా దొరుకుతుంది. ఇందులో పీచుపదార్థాలు కూడా అధికమే! పైగా నారింజలో ఉండే ఫోలేట్‌, పొటాషియం అనే పదార్థాలకి రక్తపోటుని అదుపుచేసే గుణం ఉంది.


జామ:  డయాబెటీస్‌ ఉన్నవారు జామని కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్‌ ఏ,సీలు ఆరోగ్యానికి కావల్సిన పోషకాలను అందిస్తే, పీచు పదార్థాలు ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు దోహదపడతాయి. ఇక శరీరంలోని కండరాల పనితీరుని మెరుగుపరిచే పొటాషియం కూడా జామకాయలో సమృద్ధిగా దొరుకుతుంది.


యాపిల్:  రోజుకో యాపిల్‌తో రోగాలు దూరమన్న విషయం తెలిసిందే! కానీ కాస్త తియ్యగా ఉండే యాపిల్‌ అంటే డయాబెటీస్‌ రోగులు భయపడుతూ ఉంటారు. నిజానికి యాపిల్ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంటల్ల వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది. ఇవి మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంతేకాదు! కొన్ని పోషకాలను శరీరం మరింత సమర్థంగా జీర్ణం చేసుకునేందుకు కూడా యాపిల్స్ ఉపయోగపడతాయి. అయితే వీటిని తొక్కుతో సహా తిన్నప్పుడే... మరింత ఉపయోగం అని గుర్తుచేస్తున్నారు వైద్యులు.


అరటిపండు:  అరటిలో ఉన్న సుగుణాలు అన్నీఇన్నీ కావు! అత్యంత చవకగా ఎక్కడ పడితే అక్కడ దొరికే ఈ అరటిపండులో పొటాషియం, మెగ్నీషియంలు ఉండటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందట. అంతేకాదు శరీరంలోని జీవక్రియకు (మెటాబాలిజం) తోడ్పడే B6 విటమిన్‌ కూడా అరటిలో కనిపిస్తుంది. ఇక జీర్ణక్రియకు అరటిపండు చేసే సాయం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది!


పుచ్చకాయ:  ఎండాకాలం వస్తూనే ఊరించే ఈ పండుని పూర్తిగా కాకుండా కొన్ని ముక్కలను తీసుకోవడంలో తప్పులేదంటున్నారు నిపుణులు. పుచ్చకాయలో విటమిన్‌ సి ఎలాగూ ఉంటుంది. ఇక పళ్లరసాలను దూరంగా ఉండే డయాబెటీస్‌ రోగులకు... పుచ్చకాయ, జ్యూస్‌ తాగినంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇందులో ఉండే అధిక నీరు, దాహాన్ని తీర్చి శరీరానికి కావల్సిన తేమని అందిస్తుంది.


కేవలం పైన పేర్కొన్న పండ్లే కాకుండా పీచ్‌, పియర్స్‌, కివీ, అవకాడో... వంటి విదేశీ పళ్లు కూడా తీసుకోవచ్చు. ఇలాంటి ఖరీదైన పండ్ల జోలికి ఎవరు వెళ్తారులే అనుకుంటే ఉసిరి, దానిమ్మ, పంపరపనస... వంటివి ప్రతి చోటా కాస్త తక్కువ ధరలోనే లభిస్తూ ఉంటాయి. అన్నింటికీ మించి కాస్త కాస్త మోతాదులో తీసుకోవడం, అన్ని పదార్థాలతో కలిపి లాగించేయకుండా విడిగా తినడం వంటి జాగ్రత్తలు పాటిస్తే మధుమేహం ఉన్నవారు కూడా పళ్ల రుచిని ఆస్వాదించవచ్చునని సూచిస్తున్నారు వైద్యులు.

- నిర్జర