ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమైతే!

 

2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల తరువాత యావత్‌ దేశం దృష్టినీ ఆకర్షించిన ఎన్నికలు ముగిశాయి. చెదురుమదురు సంఘటనలు మినహా, ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయిందనిపించారు. ఓటింగ్‌ ప్రక్రియ అలా ముగిసిందో లేదో, పలు సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను వెల్లడించేశాయి. ఆశ్చర్యకరంగా ఈ ఎగ్జిట్‌ పోల్స్‌లో వెల్లడైన ఫలితాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. అందుకే అసలు ఫలితాలు వెల్లడవ్వక ముందే ఆయా రాష్ట్రాల్లో సంబరాలు మొదలైపోయాయి. ఈ ఎగ్జిట్‌ పోల్సే కనుక నిజమైతే, ఓటర్లు ప్రతి రాజకీయ పార్టీకీ కొన్ని సూచనలు చేసినట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకే- ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడైన వెంటనే తాజావార్తగా మారిన అంశం, తమిళనాట జయ పరాభవం.

తమిళ తంబిలు ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ దఫాకో ద్రవిడ పార్టీకి అవకాశం ఇస్తారన్న విషయం తెలిసిందే. కానీ కరుణానిధికి వయసు మీద పడటం, ఆయన పుత్రరత్నం అళగిరి సొంత పార్టీకి గోతులు తవ్వడం చూస్తే అక్కడ ‘జయ’కేతనానికి అడ్డులేదని అనిపించింది. అయితే ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కుందేలు, తాబేలు పరుగుపందెం కథ గుర్తుకురావడం మొదలైంది. అబ్యర్థులను ఎడాపెడా మార్చేయడం దగ్గర్నుంచీ, మందకొడిగా ప్రచారం చేయడం వరకూ జయ అతి విశ్వాసం అసలుకే ఎసరు పెట్టింది. జయకు భిన్నంగా 92 ఏళ్ల కరుణానిధి ప్రచారంలో దూసుకుపోయారు. వయసుకు అతీతంగా తాను పాలించి తీరతానన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించారు. తుపానులో పులిహోర పొట్లాల మీద సైతం అమ్మ బొమ్మ వేయించే అన్నాడీఎంకే కరుణ తాకిడికి వెనక్కి తగ్గింది. వీటికి తోడు రుణ మాఫీ వంటి పథకాలతో కట్టుదిట్టంగా ఏర్పరిచిన డీఎంకే మేనిఫెస్టో కూడా ప్రజల్లో ఆ పార్టీ పట్ల విశ్వాసాన్ని రగిల్చింది. ఇక కేప్టెన్‌ విజయ్‌కాంత్‌ ఆటలో అరటిపండులా మిగిలిపోవడమే కాకుండా, ఓట్లను చీల్చి అన్నాడీఎంకేకు పరోక్షంగా నష్టం కలిగించినవారయ్యారు.

కాంగ్రెస్‌- వరుస ఎదురుదెబ్బలతో తల బొప్పి కట్టించుకున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల ఫలితాలు మరింత శిరోభారంగా మారనున్నాయి. అసోంలో మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న గోగోయ్‌ ఇప్పుడు గద్దె దిగనున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటు కేరళలోనూ రోజుకో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఊమెన్‌ చాందీని సాగనంపేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌, అగస్టా చాపర్ వంటి స్కాములతో తలగోక్కొంటున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ప్రాంతీయంగా కూడా గడ్డు పరిస్థితి ఎదురు కానుంది. ఈ ఎన్నికల తరువాత దేశంలోని దాదాపు ఐదో వంతులో మాత్రమే కాంగ్రెస్‌ పాలన నిలిచి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి జాతీయ స్థాయిలో ఆ పార్టీ పునర్వైభవం సాధించడం ఎంత కష్టమో తెలుస్తోంది. మరి ఆ కష్టమైన లక్ష్యాన్ని సాధించే సత్తా రాహుల్‌కు ఉందా!

భాజపా- అసోంలో భాజపా కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్ చెబుతున్నాయి. ఇదే కనుక నిజమైతే తొలిసారి ఈశాన్యంలో కమలం విరబూయనుంది. కానీ మిగతా రాష్ట్రాల్లో ఒకటీ అరా స్థానాలకే అది పరిమితం కానుంది. అసోంలో మూడు దఫాలుగా గెలుస్తూ వస్తున్న పార్టీని మార్చాలని ఓటర్లు భావించడం సహజమే! అందుకు ప్రత్యామ్నాయంగా భాజపా ముందుకు దూసుకురావడం మంచిదే! కానీ ఈ విజయంతో దేశంలో తమకి తిరుగులేదని భాజపా భావిస్తే కనుక త్వరలోనే ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చు. ఇప్పటికే దక్షిణాదిన బీజేపీకి వ్యతిరేకంగా గాలులు వీయడం మొదలయ్యాయి. ఇక ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన పేరుతో భాజపా ప్రతిష్ట మసకబారింది. మధ్యతరగతి ప్రజల పీఎఫ్ మీద మాటిమాటికీ కన్నేయడం, నల్లధనాన్ని వెలికితీయడంలో విఫలం కావడం చూస్తుంటే భాజపా, కాంగ్రెస్‌లు ఒకే తాను ముక్కలేమో అన్న అనుమానం ప్రజలకి కలుగుతోంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసేందుకు భాజపా చాలానే కష్టపడాల్సి ఉంది.

వామపక్షాలు- మన దేశంలో వామపక్షాలకు పెట్టని కోటలు రెండు. ఒకటి పశ్చిమబెంగాలు, రెండు కేరళ! ఈసారి ఎన్నికల్లో కేరళ వామపక్షాల కైవసం అవనుందని అంచనాలు చెబుతున్నాయి. అయితే ఇది చెప్పుకోదగ్గ విజయం ఏమీ కాదు. కేరళ ముఖ్యమంత్రి సోలార్‌ స్కాంలో పీకల్లోతు మునిగిపోవడం అక్కడ వామపక్షాలకు కలిసి వచ్చింది. పైగా తమిళ తంబిలలాగానే, కేరళ సహోదరులకు కూడా పార్టీలను మార్చి మార్చి గెలిపించుకునే అలవాటు ఉంది. ఇక పశ్చిమబెంగాల్లో మమతను ఓడించలేకపోవడం ఆ పార్టీకి పెను పరాభవం. ఈ ఎన్నికల యుద్ధానికి ముందు నారదా స్కాం, కోల్‌కతా ఫ్లై ఓవర్‌ సంఘటన, తృణమూల్‌ మూకల హింస... తదితర అస్త్రాలు వామపక్షాలకు ఎన్ని అందినా కూడా అవి మమతను నివారించలేకపోయాయి. అందుకు కారణం వారి స్వయంకృతాపరాధాలే! దశాబ్దాల తరబడి వామపక్షాలు సాగించిన పాలనతో బెంగాలీ బాబులు విసుగెత్తిపోయారు. ఒక తరం పాటు తలెత్తుకు తిరగలేనంతగా బెంగాల్‌ వెనుకబడిపోయింది. అలాంటి దౌష్ట్యం కంటే మమత మొండి వైఖరే మేలన్న అభిప్రాయానికి జనం వచ్చేశారు. బెంగాల్లో వామపక్షం మళ్లీ వెలగాలంటే, వారి పాలన తాలూకు జ్ఞాపకాలు చెరగాల్సిందేనేమో!