న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతోంది... దిశ నిందితుల ఎన్ కౌంటరే రుజువు

 

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హర్హాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే, న్యాయ వ్యవస్థలోని లోపాలను కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతమున్న న్యాయ వ్యవస్థతో బాధితులకు న్యాయం జరగడం లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. నేర నిరూపణ జరిగినా దోషులకు శిక్షలు పడటం లేదని, వేగంగా బాధితులకు న్యాయం జరగడం లేదని, దాంతో న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతోందని అన్నారు. అందుకు దిశ నిందితుల ఎన్ కౌంటరే నిదర్శనమన్నారు.

చట్ట ప్రకారమైతే న్యాయం జరగదని ప్రజలు భావిస్తున్నారని, అందుకే దోషులను తామే శిక్షిస్తామని, లేదంటే ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. ముఖ్యంగా అత్యాచార కేసుల్లో న్యాయం ఆలస్యం అవుతుండటం అస్సలు మంచిది కాదన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. నేరస్థులకు వేగంగా శిక్ష పడకపోవడంతోనే సమాజంలో ఘోరాలు పెరిగిపోతున్నాయని, దీన్ని అరికట్టాల్సిన అవసరముందన్నారు. ఇప్పటికైనా కేంద్రం మేల్కొని నేర న్యాయ వ్యవస్థను బలోపేతం చేసి నేరస్థులకు వేగంగా శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు.