పంచనామా పూర్తి... కాసేపట్లో పోస్టుమార్టం... ఈరోజే అంత్యక్రియలు

 

 

ఎన్ కౌంటర్ లో హతమైన దిశ నిందితుల మృతదేహాలకు ఒక ఆర్డీవో, నలుగురు తహశీల్దార్ల ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. కోర్టు అనుమతితో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాతి రోజే ఎన్ కౌంటర్ జరగడంతో ...ఎలాంటి న్యాయపరమైన చిక్కులు, పోలీసులకు ఇబ్బందులు లేకుండా పంచనామా పూర్తి చేశారు. ఎన్ కౌంటర్ జరిగిన తీరు... నిందితుల మృతదేహాల్లో ఎక్కడెక్కడ బుల్లెట్లు దిగాయో... ఎటువైపు కాల్పులు జరిగాయో... మృతదేహాలు పడివున్న తీరు... ఇలా ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంచనామా చేశారు. పంచనామా ప్రక్రియ తర్వాత నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించనున్నారు. ఐదుగురు సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం పూర్తిచేసి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు. అయితే, నిందితుల స్వగ్రామాల్లో ఇప్పటికే మోహరించిన పోలీసులు... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు, ఎంత రాత్రయినాసరే ఈరోజే అంత్యక్రియలు ముగించాలని నిందితుల కుటుంబ సభ్యులను పోలీసులు ఆదేశించినట్లు తెలుస్తోంది.