కిరణ్ కుమార్ రెడ్డిని వెనకేసుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ మాట్లాడిన తరువాత ఊహించినట్లుగానే ఆయనపై జైపాల్ రెడ్డితో సహా తెలంగాణావాదులు అందరూ తీవ్ర విమర్శలు చేసారు. ఇక తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అయితే కిరణ్ కుమార్ రెడ్డి మానసిక పరిస్థితి బాగోలేదంటూ హేళన చేయడమే కాకుండా, ఆయన కావాలనుకొంటే హైదరాబాదులో ‘కర్రీ పాయింటు’ నడుపుకోవచ్చునని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చేరు.

 

ఇక టీ-కాంగ్రెస్ నేతలు కూడా కేసీఆర్ కు ఎంత మాత్రం తీసిపోకుండా ముఖ్యమంత్రిని దుమ్మెత్తిపోశారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అయితే, ఏకంగా గంటకు పైగా మీడియా సమావేశం నిర్వహించి, ఆయన లేవనెత్తిన ప్రతీ అంశాన్ని తప్పుపడుతూ వాదనలు చేసి, కమాండరు ఎన్నడూ కూడా కుట్రదారుడుగా వ్యవహరించడం కూడదని సున్నితంగా వాతలు పెట్టారు. కొంత మంది టీ-కాంగ్రెస్ నేతలు కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్టానానికి పిర్యాదు చేయడానికి కూడా సిద్దపడుతున్నారు.

 

అయితే, వారందరినీ నివ్వెరపరుస్తూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్, కిరణ్ కుమార్ రెడ్డిని వెనకేసుకు వస్తూ “ఆయన విధేయుడయిన క్రమశిక్షణగల పార్టీ కార్యకర్త” అని వర్ణించారు. అంతే గాకుండా, “ఆయన పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించి తప్పు చేసాడని భావించడం లేదని, అందువల్ల ఆయనని సంజాయిషీ కోరడం లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకొనే ప్రసక్తే లేదని” కూడా స్పష్టం చేసారు.

 

ఇక, దిగ్విజయ్ సింగ్ నిన్నఆంటోనీ కమిటీ గురించి మీడియాతో మాట్లాడుతూ ‘ఆ కమిటీకి తెలంగాణతో, రాష్ట్ర విభజన ప్రక్రియతో ఖచ్చితంగా సంబంధం ఉందని’ కుండ బ్రద్దలు కొట్టడంతో, అంతవరకు అందుకు విరుద్దంగా వాదిస్తున్న టీ-కాంగ్రెస్ నేతలే కాదు తెరాస నేతలు కూడా ఆశ్చర్యపోయారు. అదేవిధంగా ‘అంటోనీ కమిటీ తన పని పూర్తిచేయడానికి నిర్దిష్ట కాలపరిమితి కూడా ఏమీ విధించలేదని ఆయన మరో బాంబు కూడా ప్రేల్చారు.

 

విభజనకు వ్యతిరేఖంగా మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డిని దండించకపోగా ఆయనను వెనకేసుకు రావడం, అంటోనీ కమిటీ గురించి దిగ్విజయ్ సింగ్ అన్నమాటలతో తెలంగాణా వాదులందరిలో మళ్ళీ ఆందోళన, ఆనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడు మంత్రి శైలజానాథ్ ‘తామే విభజన ప్రక్రియను వాయిదాపడేలా చేసామని’ చెప్పడం మరింత అనుమానాలకు తావిస్తోంది. అందుకే, నిన్న కేసీఆర్ మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందేవరకు తెలంగాణాలో ఎటువంటి సంబరాలు, సన్మానాలు పెట్టుకోవద్దని సూచించారు.