ఏపీ రాజధాని నిర్మాణానికి సింగపూర్, జపాన్ రెడీ

 

ఇటీవల సింగపూర్ మరియు జపాన్ దేశాలు పర్యటించివచ్చిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం రాజధాని నిర్మాణం కోసం వారి సహాయం కోరారు. వీటిలో సింగపూర్ కు ఆయన రాజధాని మాస్టర్ ప్లాన్ తయారు చేసే బాధ్యతలు, సాంకేతికంగా అభివృద్ధి చెందిన జపాన్ దేశానికి రాజధాని నిర్మాణ బాధ్యతలు అప్పగించబోతున్నారు. అందుకు ఆ రెండు దేశాలు కూడా అంగీకరించాయి. ముందుగా సింగపూర్ మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇస్తే దానిని అధ్యయనం చేసిన తరువాత నిర్మాణంలో ఏ మేరకు సాంకేతిక సహకారం అందించాలో జపాన్ నిర్ణయించుకొంటుంది. మాష్టర్ ప్లాన్ రూపకల్పన కోసం ముందుగా సింగపూర్ నుండి ఒక నిపుణుల బృందం త్వరలో రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతాలను సందర్శిస్తుంది. వారు జనవరి నెలాఖరులోగా మాష్టర్ ప్లాన్ రూపొందించాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. మాష్టర్ ప్లాన్ చేతికి అందగానే దానిని అధ్యయనం చేసిన తరువాత జపాన్ బృందం కూడా ఏపీ రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతాలను సందర్శిస్తుంది. వారు సూచించిన మార్పులు చేర్పులతో మళ్ళీ సింగపూర్ నిపుణులు తుది ప్లాన్ సిద్దం చేసి జపాన్ బృందానికి అందజేస్తారు.

 

రాజధాని భూములను పరిశీలించదానికి వచ్చే జపాన్ బృందంతో బాటే, రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పరిశ్రమలు, మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు అవసరమయిన వివరాలను సేకరించేందుకు మరో బృందం కూడా వచ్చే అవకాశం ఉంది.

 

మార్చి నెలలో ఉగాది రోజున గానీ మే నెలలో యన్టీఆర్ జయంతి రోజున గానీ రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసి శంఖు స్థాపన చేయాలని భావిస్తున్నారు. ఈలోగా భూసేకరణ, నిధుల సమీకరణ, కేంద్రం నుండి అవసరమయిన అనుమతులు మంజూరు చేయించుకోవడం వంటి కార్యక్రమాలు పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకొన్నట్లు సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది డిశంబరులోగా రాజధాని నిర్మాణపనులు మొదలయ్యే అవకాశం ఉంది.

 

సింగపూర్ ఆధునిక నగరాలను డిజైన్ చేయడంలో అందెవేసిన చెయ్యని పేరు పొందితే, జపాన్ దేశం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు పరికరాలను ఉపయోగిస్తూ చాలా వేగంగా నగర నిర్మాణం చేయగల సత్తా ఉందని మంచి పేరు సంపాదించుకొంది. ఆ కారణంగానే వారిరువురి భాగస్వామ్యంతో ప్రపంచంలోకెల్లా అత్యాధునికమయిన రాజధాని నిర్మించాలని చంద్రబాబు ఉవ్విళ్ళూరుతున్నారు. ఒకవిధంగా ఇది తన కార్యదీక్షను నిరూపించుకోనేందుకే వచ్చిన ఒక గొప్ప అవకాశంగా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.