మునుగుతున్న పడవెక్కిన మమత బెనర్జీ

 

నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత తనకు అత్యంత సన్నిహితుడయిన అమిత్ షాను బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన తరువాత వారిరువురూ కలిసి పార్టీపై, ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించగలిగారు. వారిరువురూ కలిసి పార్టీని దేశంలో అన్ని రాష్ట్రాలకు విస్తరించి అధికారం దక్కించుకొనేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలలో పార్టీని అధికారంలోకి తెచ్చిన వారిరువురూ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నఝార్ఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాలపై దృష్టి లగ్నం చేసారు. ఝార్ఖండ్ పై అమిత్ షా దృష్టి లగ్నం చేసి పనిచేస్తుంటే, మోడీ జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాలలో తన మాటల మాయాజాలంతో అక్కడి ప్రజలను బాగానే ఆకట్టుకొంటున్నారు.

 

ఇంతవరకు అక్కడ మువన్నెల జాతీయ జెండా ఎగురవేసేందుకు కూడా రాజకీయ పార్టీలు భయపడే పరిస్థితి ఉండగా, ఇప్పుడు మోడీ ఎన్నికల ప్రచార సభలకు భారీగా ప్రజలు తరలి వస్తుండటం గమనిస్తే అక్కడ కూడా మోడీ మాయాజాలం ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. దశాబ్దాలుగా రెండు రాష్ట్రాలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో అక్కడి ప్రజలు అభివృద్ధి మంత్రం పాటిస్తున్న బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆ రెండు రాష్ట్రాలు తమ చేతికి వచ్చిన తరువాత వారిరువురూ వచ్చే సం. ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంపై పట్టు సాధించేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టేసారు.

 

కామ్రేడ్ల కంచుకోటను బ్రద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ చేతిలో నుండి అధికారం చేజిక్కించుకోవాలని వారిరువురూ గట్టిగా సంకల్పం చెప్పుకొన్నారని అమిత్ షా నిన్న కోల్ కతాలో చేసిన ప్రసంగం వింటే స్పష్టమవుతుంది. ఝార్ఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రాల ఎన్నికలలో గెలిచినప్పటికీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గెలిస్తే తప్ప తమ విజయం పరిపూర్ణం కాబోదని, త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలలో వచ్చే ఏడాది సెప్టెంబరులో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించినపుడే తమ విజయయాత్రకు పరిపూర్ణత వస్తుందని అమిత్ షా స్పష్టం చేసారు.

 

కేంద్రంలో అధికారంలో ఉన్నబీజేపీని ఎదురొడ్డి నిలవడం తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీకి చాలా కష్టమేనని చెప్పవచ్చును. అందుకే ఆ పార్టీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరుతోంది. అయితే ఆమె రాహుల్ గాంధీ నడిపిస్తున్న మునిగిపోయే టైటానిక్ షిప్పు వంటి కాంగ్రెస్ లోకి చేరడం వలన ఆమె కూడా మునిగే ప్రమాదం ఉంది. అందువల్ల తక్షణమే మరో మంచి షిప్పు ఏదయినా ఉంటే చూసుకోవడం మంచిదేమో. లేకుంటే తల్లీ, పిల్ల కాంగ్రెస్ రెండూ కూడా మునగడం ఖాయమని భావించవచ్చును.