దేవినేని చంద్రశేకర్ తెలుగుదేశం పార్టీలో జేరనున్నాడా?

 

1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిననాటి నుండీ 1996లో ఎన్టీఆర్ మరణించే వరకు పార్టీలో కొనసాగిన దేవినేని నెహ్రు, ఆ తరువాత పార్టీలోతనకు తీవ్ర ప్రతికూల పరిస్థితులేర్పడటంతో, తప్పని పరిస్థితుల్లో తెదేపాను వీడి, 1997 లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఆయనని అభిమానించేవారు చాలామంది ఉన్నారు. ఆ కారణం చేతనే, కొద్ది సం.ల క్రితం ఆయనను తిరిగి పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు జోరుగా సాగాయి. గానీ, ఆయనను వ్యతిరేఖించే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అడ్డుపడటంతో దేవినేని కాంగ్రెసులోనే కొనసాగుతున్నారు.

 

అయితే ఆయన వర్గానికే చెందిన ప్రజలు అనేక మంది ఆయనను అభిమానిస్తున్నపటికీ, అయన కాంగ్రెస్ పార్టీలో జేరడంతో ఆయనకి దూరంగా ఉండిపోయారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో జేరడంవలన ఆయన తన వర్గానికి చెందిన ప్రజలను, అభిమానులను దూరం చేసుకొనగా, అటువంటి సమర్ధుడు, శక్తివంతుడయిన నేతని పోగొట్టుకొని తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రనష్ట పోయింది. మరి చేసేదేమిలేక, అంబటి బ్రాహ్మణయ్యవంటి కులపెద్దను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడుగా నియమించుకొని, యువకుడయిన దేవినేని ఉమాను కార్యదర్శిగా నియమించింది.

 

అయితే, అధికారానికి దూరమయిన ఈ 9 సం.లలో తెలుగుదేశం పార్టీకి ఒక విషయం స్పష్టంగా అర్ధమయింది. దేవినేని కుటుంబాన్ని దూరం చేసుకొన్నలోటును మరెవరూ కూడా పూడ్చలేరని అర్ధం అయింది. ప్రస్తుత పరిస్థితుల్లో, ఆయనను తిరిగి పార్టీలోకి రప్పించలేకపోయినప్పటికీ, అయన సోదరుడు బాజీప్రసాద్ తనయుడు చంద్రశేఖర్‌కు స్థానికంగా యువతలో ఉన్న మంచి పేరు, మంచి ఫాలోయింగు దృష్ట్యా కనీసం ఆయననైనా తెలుగుదేశం పార్టీలోకి రప్పించాలని పాదయాత్రలో ఉన్న చంద్రబాబును పార్టీ శ్రేణులు కోరడంతో ఆయన అందుకు అంగీకరించినట్లు సమాచారం.

 

అయితే, ఈ వ్యవహారాన్ని అయన స్వయంగా బాలకృష్ణకి అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణకి, దేవినేని కుటుంబ ప్రతినిధులకీ మద్య ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. చంద్రశేఖర్‌కు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పెనమలూరు సీటు ఇచ్చేందుకు పార్టీ అంగీకరించినట్లయితే తెలుగుదేశం పార్టీలో చేరడానికి అయన సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ, అన్నీ సవ్యంగా జరిగినట్లయితే చంద్రబాబు పాదయాత్ర కృష్ణా జిల్లా సరిహద్దులు దాటకమునుపే, దేవినేని చంద్రశేకర్ తెలుగుదేశం పార్టీలో జేరే అవకాశాలు ఉన్నాయి.