ఇంకుతో ఏదంటే అది రాస్తే... ఇంకు దాడులు తప్పవా?

దేశంలో పార్లమెంట్ ఎన్నికల తరువాత అంత పెద్ద కలకలం రేగేది యూపీ ఎన్నికలప్పుడే! ఎట్టకేలకు అది పూర్తైంది. కాని, వెంటనే నెక్స్ట్ ఎలక్షన్స్ కి సిద్ధమవుతోన్న రాష్ట్రాల్లో వ్యవహారం మొదలైనట్టు కనిపిస్తోంది! మరీ ముఖ్యంగా, కర్ణాటకలో! కాంగ్రెస్ చేతిలో వున్న నిజమైన పెద్ద రాష్ట్రం ఇదొక్కటే! 

 


దక్షిణాదిలో ఎలాగైనా పాగా వేయాలనుకుంటున్న బీజేపికి ఆ అవకాశాలు పుష్కలంగా వున్న చోటు కర్ణాటక. గతంలో ఒకసారి అధికారం చేజిక్కించుకునీ, నిలుపుకోలేకపోయిన కాషాయ దళం రాబోయే ఎన్నికల కోసం బాగానే కసరత్తు చేస్తోంది. ఒకప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా చేసిన ఎస్ఎం కృష్ణ త్వరలోనే బీజేపిలో చేరబోతున్నారు. ముందు ముందు ఈ వలసలు మరింతగా వుండే ఛాన్స్ వుంది!

 


పవర్ కోసం జరిగే పొలిటికల్ గేమ్స్ పక్కన పెడితే కర్ణాటకలో ఆరెస్సెస్, వీహెచ్ పీ, బజరంగ దళ్ లాంటి సంస్థల కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతుంటాయి. అందుకే, క్షేత్రస్థాయిలో గొడవలు, దాడులు కూడా ఎక్కువగానే వుంటాయి. కాషాయ కార్యకర్తలు అభ్యుదయవాదులుగా చెలామణి అయ్యేవారిపై దాడులు చేయటం, అందుకు విపరీతంగా నిరసనలు రావటం కర్ణాటకలో మామూలే. అయితే, మీడియాలో అంతగా చోటు దక్కించుకోని విషయం ఏంటంటే, కర్ణాటకలో ఈ మధ్య ఆరెస్సెస్, బీజేపి వర్కర్లు కూడా హత్యలకు గురవుతున్నారు. రాజధాని బెంగుళూరులోనే మర్డర్లు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నట్లు కనిపించటం లేదు! కాని, తన ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా హిందూత్వ సంస్థల్ని బోనులో నిలబెట్టే అవకాశాల్ని మాత్రం వదులుకోవటం లేదు. తాజాగా దావాణగెరె ప్రాంతంలో యోగేశ్ మాస్టర్ అనే రచయితపై కొందరు హిందూత్వ సంస్థల కార్యకర్తలు నల్లటి నూనేతో దాడి చేశారు. ఒక పుస్తకావిష్కరణకు అక్కడకు వచ్చిన యోగేష్ పై కొందరు అగాంతకులు వచ్చి నూనేతో దాడి చేసి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారట!

 


యోగేష్ అనే రచయిత గతంలో దుండీ అనే పుస్తకం రాసి వివాదంలో ఇరుక్కున్నారు. అందులో గణపతిని తప్పుగా చిత్రకరిస్తూ ఆయన ఏదేదో రాశారట. సహజంగానే ఆయన ఫ్రీడమ్ ఆప్ స్పీచ్ ను సమర్థించే వారి మద్దతు పొందాడు. కాషాయ సైనికుల ఆగ్రహానికి గురయ్యాడు. దాని ఫలితమే నల్లటి నూనేతో దాడి! యోగేష్ పై దాడి చేసిన వార్ని కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని ఆదేశించిన కర్ణాటక కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్య ఇంత అలెర్ట్ గా ఆరెస్సెస్ , ఇతర హిందూ సంస్థల కార్యకర్తలు హత్యలకి గురైతే వుండటం లేదు. కేరళలో కూడా హిందూత్వం వినిపించే వారి ప్రాణాలకు దారుణమైన గండం దాపురిస్తోంది. దక్షిణాదిలో బీజేపి విస్తరణని అడ్డుకునే ఉద్దేశ్యంలో భాగంగా కాంగ్రెస్ , సీపీఎం లాంటి పార్టీలు ఈ దాడుల్ని చూసీ చూడనట్టు వదిలేస్తున్నాయి!

 


ఒక రచయిత పై నూనె దాడిని ఎవ్వరమైనా ఖండించాల్సిందే. కాని, అదే సమయంలో సెక్యులర్ పార్టీలు, మీడియా కాషాయ కార్యకర్తల హత్యల్ని కూడా తీవ్రంగా పరిగణించాలి. అలా చేయకుంటే ఇప్పటికిప్పుడు లాభం అవ్వొచ్చు కాని... రాబోయే ఎన్నికల్లో బీజేపి యూపీ తరహా స్వైర విహారం చేసే అవకాశం వుంది! జనాల్లో ఒక్కసారి సానుభూతి వచ్చాక ఏ సెక్యులర్ నీతులు కూడా పోలింగ్ సెంటర్ల వద్ద పని చేయవు!