కడుపులో బిడ్డని బట్టి తల్లి ఆరోగ్యం


 

పుట్టబోయే బిడ్డ ఆడపిల్లా, మగపిల్లవాడా అని చెప్పడానికి మన పెద్దలు రకరకాల లక్షణాలు చెబుతూ ఉంటారు. పొట్ట ఎత్తుగా ఉందా, ఆయాసం వస్తోందా, ఒళ్లు చేశారా... ఇలా భిన్నమైన లక్షణాల ఆధారంగా కడుపులో ఉన్న బిడ్డ ఆడా, మగా అని అంచనా వేస్తుంటారు. వినడానికి ఇవన్నీ సరదాగానో, కించిత్తు ఛాదస్తంగానో కనిపిస్తాయి. కానీ ఈ మధ్యే జరిగిన ఓ పరిశోధనని కనుక గమనిస్తే... మన పెద్దల మాటలని మరీ అంత కొట్టి పారేయడానికి వీల్లేదని అనిపిస్తుంది.

 

ఓహియో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు... తల్లి గర్భంలో ఉన్న శిశువు లైంగికతకీ, ఆమె రోగనిరోధక శక్తికీ మధ్య సంబంధం ఏమన్నా ఉందేమో అని గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు మన ఒంట్లో రోగనిరోధక శక్తిని ప్రతిబింబించే సైటోకైన్స్ (cytokines) అనే కణాల తీరుని గమనించారు. కడుపులో ఆడపిల్ల ఉన్నా, మగపిల్లవాడు ఉన్నా ఈ సైటోకైన్స్ సంఖ్యలో పెద్దగా మార్పు రాలేదు. కానీ ఆడపిల్ల కడుపులో ఉన్నప్పుడు ఏర్పడే సైటోకైన్స్ తీరు కాస్త విభిన్నంగా కనిపించింది.

 

గర్భంలో ఉన్న శిశువు ఆడపిల్ల అయితే కనుక inflammation అనే చర్యకు అనుకూలమైన సైటోకైన్స్ కనిపించాయట. మన శరీరంలోకి హానికారక సూక్ష్మక్రిములు కానీ రోగకారకాలు కానీ ప్రవేశించినప్పుడు... వాటిని ఎదుర్కొనేందుకు జరిగే పోరాటమే inflammation. ఈ సందర్భంగా శరీరాన్ని పోరాటానికి సన్నద్ధంగా ఉంచేందుకు తెల్లరక్తకణాల వంటి కణాల సంఖ్య ఇతోధికంగా పెరిగిపోతుంది. గాయం చుట్టూ మనకి కనిపించే వాపు ఇలా ఏర్పడేదే! అయితే ఈ inflammation ఒకోసారి మన రోగనిరోధక శక్తికి సాయపడితే, మరికొన్ని సందర్భాలలో లేనిపోని ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతుంది. అనవసరంగా శ్వాసనాళాలు వాయడం వల్ల ఆస్తమా, కీళ్ల దగ్గర వాపు ఏర్పడటం వల్ల ఆర్థ్రయిటిస్ వంటి సమస్యలు ఏర్పడతాయి.

 

ఆడపిల్ల కనుక గర్భంలో ఉంటే ఇలా inflammationకు సంబంధించిన లక్షణాలు అధికంగా కనిపిస్తాయన్నమాట. దీని వలన మేలు, కీడు రెండూ అధికంగానే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భీణీ స్త్రీలకు చికిత్స చేసేటప్పుడు వారి కడుపులో ఉన్న శిశువు ఆడా, మగా అన్న విషయం మీద స్పష్టత ఉంటే... దానికి అనుగుణంగా వారికి చికిత్స చేయవచ్చని సూచిస్తున్నారు పరిశోధకులు. గర్భిణీ స్త్రీలలో ఆస్తమా వంటి సమస్యలు ఏర్పడినప్పుడు, వారి కడుపులో ఉన్న శిశువు లైంగికతను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అన్నింటికీ మించి... తగిన వ్యాయామం, ఆకుకూరల వంటి పోషకాహారం తినడం, ధ్యానం వంటి పద్ధతుల ద్వారా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే ఎలాంటి అవాంతారాలూ లేకుండా పండంటి బిడ్డను కనవచ్చని సూచిస్తున్నారు.

- నిర్జర.