మహాలక్ష్మికి ‘ఉచిత’ కష్టాలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  18 నెలలు పూర్తయింది. ఈ 18 నెలల కాలంలో ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల్లో ఎన్ని అమలు చేసింది.. ఎన్నిటికీ ఎగనామం పెట్టింది? అంటే..  మంత్రులు, కాంగ్రెస్ నాయకులు  బట్టిపట్టిన అప్పగించే పాఠం ఉచిత బస్సు తోనే  మొదలవుతుంది.  కానీ.. గ్యారెంటీలు, హామీలు ఎంతవరకు అమలవుతున్నాయో వాస్తవంలో ఏమి జరుగుతోందో ఎవరికీ తెలియదు. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి చూస్తే..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో ఆశించిన ఫలితాలు అందుకోవడంలో  ఫెయిల్  అయిందనే అభిప్రాయమే గట్టిగా వినిపిస్తోంది.  

ఇతర గ్యారెంటీలు,హామీల విషయం ఎలా ఉన్నా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే    అత్యంత ఆర్భాటంగా శ్రీకారం చుట్టిన మహాలక్ష్మి ‘ఉచిత’ ప్రయాణం పథకం పై కూడా పెదవి విరుపులే వినిపిస్తున్నాయి. ఆరంభలో ఎలా ఉన్నా.. మెల్లమెల్లగా  ఉచిత బస్సు’ సమస్యలను ఎదుర్కుంటోంది. పథకం ప్రయోజన పొందుతున్న మహిళల్లో సైతం  పెద్ద ఎత్తున  అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక పురుషుల సంగతి అయితే చెప్పనక్కరలేదు. బస్సులలో రద్దీ పెరిగి, మహిళలతోపాటుగా, పురుష ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో  ఈథేమ్స్‌ బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థులు నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. ప్రధానంగా  పథకం ప్రయోజనం పొందుతున్న మహిళల్లోనూ సగం మందికిపైగా అంటే దాదాపు 52 శాతం  మహిళలు నెగిటివ్ మార్కులు వేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఏమో కానీ.. ఉచిత కష్టాలు  ఎక్కువయ్యాయని మహిళలు అంటున్నారు.  

రద్దీకి తగినట్టు బస్సులు లేకపోవడం, సీట్లు దొరకకపోవడం వంటి ఉచిత బస్సు కష్టాలను ఏకరవు పెడుతున్నారు.   అంతే కాదు, సీట్ల కోసం మహిళలు సిగపట్లు కారణంగా ప్రయాణం ఆలస్యం అవుతోందని.. ఫలితంగా పురుషుల దూషణలు భరించవలసి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సర్వే ఫలితం చెబుతోంది.
కాగా ఈథేమ్స్‌ బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థులు  43 రోజుల పాటు నిర్వహించిన సర్వేలో 480 మంది మహిళలతో మాట్లాడినట్టు  సర్వేకు సారధ్యం వహించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ సహేరా ఫాతిమా, డాక్టర్‌ నాగలక్ష్మి కుందేటి తెలిపారు. అలాగే.. ఫలితాను విడుదల చేసిన సందర్భంగా వారు.. తప్పుల్ని వెతకడం కాదు..మార్గాలను సూచించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు.

ప్రజా రవాణా కోట్లాది మందికి జీవనాధారమనీ.. తెలంగాణ ఆర్టీసీలో రోజుకు 9వేల బస్సులు తిరుగుతుండగా,40 లక్షల మందికిపైగా సేవలు పొందుతున్నారనీ, వీరిలో అధికశాతం మహిళలే ఉన్నారని  పేర్కొన్నారు.  ప్రయాణంలో సీట్లు దొరక్క అసౌకర్యాన్ని ఎదురొంటున్నట్టు 52 శాతం మంది మహిళలు చెప్పారన్నారు.  అలాగే, 23 శాతం మంది మహిళలకు మాత్రమే భద్రతా టూల్స్‌ గురించి తెలుసని సర్వే సిబ్బంది చెప్పారు.ఆర్టీసీ సిబ్బందికి జెండర్‌ సెన్సిటివిటీపై శిక్షణ ఇవ్వాలని కోరారు.
కాగా  ఈ సర్వేపై స్పందించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌, ఈథేమ్స్‌ అధ్యయనాన్ని స్వాగతిస్తున్నా.. సర్వే నివేదిక సూచించిన చాలా అంశాలు ఇప్పటికే అమలు దశలో ఉన్నాయన్నారు. మహిళల భద్రత, గౌరవం పెంపునకు ఆర్టీసీ కట్టుబడి ఉన్నదనీ,  బస్సుల సంఖ్య పెంపు, సిబ్బంది శిక్షణ, హెల్ప్‌లైన్‌లు, సీసీటీవీలు, ట్రాకింగ్‌ యాప్‌లు, షీటీమ్స్‌ సహకారం వంటివి ఉన్నాయన్నారు. 

అదలా ఉంటే, నిత్యం బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకులు బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచవలసిన అవసరం ఉందనీ..  అదే సమయంలో ఉచితానికి కూడా హద్దులు ఉండాలని సూచిస్తున్నారు. ఆర్థిక స్తోమతను కూడా పరిగణననలోకి తీసుకోవాలని.. అలాగే, మహిళల కోసం ప్రత్యేక ఉచిత బస్సులు నడిపితే..  టికెట్ చార్జీ చెల్లించేందుకు సిద్దమైన మహిళలకు కూడా సౌకర్యంగా ఉంటుందని, సాధారణ ప్రయాణీకులు సూచిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu