కేసీఆర్‌‌ ప్రభుత్వాన్ని విమర్శించడం నేరం.. ఘోరం..!

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వం చేపట్టి రెండు నెలలు దాటింది. ఈ రెండు నెలల కాలంలో కేసీఆర్ ఊడబొడిచింది ఏమీ లేదని, రోజుకు రెండు మూడు కొత్త పథకాలను ప్రకటిస్తూ జనం చెవుల్లో పువ్వులు పెట్టడం మినహా ఆయన సాధించింది ఏమీ లేదని ప్రతిపక్ష పార్టీల నాయకులు అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నారు. అయితే అలా విమర్శించడం తగదు. కేసీఆర్ అధికారాన్ని చేపట్టి కేవలం రెండు నెలలేగా అయింది. ఈ కొద్ది వ్యవధిలోనే అద్భుతాలు సృష్టించడం సాధ్యం కాదు కదా.. ఈ విషయాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తు్న్నవారు అర్థం చేసుకోవాలి. ఈ రెండు నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క పని కూడా జరగలేదని, హామీలతోనే కేసీఆర్ తెలంగాణ ప్రజల కడుపులు నింపేస్తున్నారని విమర్శించడం ఎంతవరకు న్యాయమో ప్రతిపక్షాలు ఆలోచించుకోవాలి.

 

అలాగే కొంతమంది నాయకులు కేసీఆర్ ప్రభుత్వం చాలా విషయాలలో విజ్ఞత లేకుండా ఆలోచిస్తోందని, అందువల్లే అనేక విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకోవాల్సి వచ్చిందని, కోర్టుల దగ్గర మొట్టికాయలు వేయించుకోవాల్సిన ఖర్మ పట్టిందని అంటున్నారు. అధికార పార్టీ నాయకులకు ఉద్యమ ఆవేశం తప్ప, పరిపాలనా చాతుర్యం లేదని జాతీయ స్థాయిలో నవ్వుకునేలా కేసీఆర్ చేశారని విమర్శిస్తున్నారు. ఇలాంటి విమర్శలు ఎంతమాత్రం న్యాయం కాదు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో మీడియా గొంతు నొక్కేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలు పూర్తిగా నిరాధారం. ఇదంతా కేసీఆర్ మీడియాతో ఎంత ఫ్రెండ్లీగా వుంటున్నారో తెలిసికూడా చేస్తున్న దుష్ప్రచారం తప్ప మరొకటి కాదు.

 

ఆగస్టు 19వ తేదీన కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే మీద కొంతమంది నోరు చేసుకుంటున్నారు. సీమాంధ్రుల మీద కేసీఆర్ చేస్తున్న కుట్రలో భాగమే ఈ సర్వే అని విమర్శిస్తున్నారు. సర్వే పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టమని కోర్టుకు హామీ ఇచ్చి కూడా ప్రజల్ని ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం కుట్రలు పన్నిందని అంటున్నారు. అయితే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులకు తగదు. ఎంతో చిత్తశుద్ధితో, ఎంతమాత్రం ప్రాంతీయ భేదం లేకుండా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందర్నీ కన్నబిడ్డల్లా పరిపాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం నేరం.. ఘోరం..!