కాంగ్రెస్ ఓటమికి రాహుల్ కాదు మోడీయే కారణమట

 

 

శంఖంలో పోస్తే కానీ నీళ్ళు తీర్ధం కావన్నట్లు, రాజకీయపార్టీలు తమ అభిప్రాయాలకు, నమ్మకాలకు శాస్త్రీయత కల్పించి వాటిని ప్రజల మీద రుద్దేందుకు కమిటీలు వేసుకొంటుంటాయి. అటువంటిదే అంటోనీ కమిటీ కూడా. ముంజేతి కంకణంలా కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారాణాలు కళ్ళెదుట కనబడుతున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలు కనుగొనేందుకు వేయబడిన అంటోనీ కమిటీ ఊహించినట్లే కొండను త్రవ్వి ఎలుకను పట్టుకొంది.

 

నివేదికలో మొట్ట మొదటగా పార్టీ అపజయానికి రాహుల్ గాంధీ ఎంత మాత్రం బాధ్యుడు కాడని దృవీకరించింది. సోనియా, రాహుల్ గాంధీ ఇరువురూ కూడా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారని, అయినప్పటికీ ప్రజలు, చివరికి మీడియా కూడా మోడీ మాయలో పడిపోయినందునే పార్టీ ఓడిపోయిందని నివేదిక స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు చూస్తున్న కొన్ని శక్తులే రాహుల్ గాంధీకి నాయకత్వపటిమ లేదనే వదంతులు వ్యాపింప జేస్తున్నాయని, కానీ రాహుల్, సోనియా గాంధీల నాయకత్వంలోనే పార్టీ పునర్వైభవం సాధిస్తుందని నివేదికను తయారు చేసిన అంటోనీ అభిప్రాయపడ్డారు. అందువల్ల సోనియా, రాహుల్ గాంధీల వలన కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని, మోడీ వలననే ఓడిపోయిందని, కమిటీ తేల్చి చెప్పింది

 

కనుక ఇక కాంగ్రెస్ నేతలెవరూ వారిరువురి నాయకత్వాన్ని సందేహించనవసరం లేదు. అదేవిధంగా వారిరువురి నాయకత్వంలో ఏదో ఒకరోజు పార్టీ పునర్వైభవం సాధించడం కూడా ఖాయమని అంటోనీ కమిటీ ద్రువీకరిస్తోంది గనుక ఇక కాంగ్రెస్ నేతలు అందరూ గుండెల మీద హస్తాలు వేసుకొని హాయిగా నిద్రించవచ్చును. కమీటీల వలన ఇటువంటి గొప్ప ప్రయోజనాలున్నాయి గనుకనే, రాజకీయ పార్టీలు కమిటీలు వేసుకొంటుంటాయి. దీనిని బట్టి తెలుసుకోవలసిన గొప్ప సత్యం ఏమిటంటే జ్ఞానంలోనే కాదు అజ్ఞానంలో కూడా ఆనందం ఉంటుందని తెలుస్తోంది.