మీనాక్షినటరాజన్ కు ‘చేతి’ నిండా పని! 

కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ వ్యవహార శైలి, కాంగ్రెస్ కల్చర్ కు  చాలా భిన్నంగా ఉంటుందని  రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో చాలా  కాలంగా వినిపిస్తోంది. అవును.. కాంగ్రెస్ నాయకులు, శ్రేణులతో పాటుగా  ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలలో కూడా మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ కల్చర్ కు భిన్నంగా వ్యహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. 

నిజానికి.. ఆమె ఎంట్రీనే  కాంగ్రెస్  కల్చర్’కి భిన్నంగా జరిగింది. ఎలాంటి స్వాగత సత్కార్యాలు, మేళతాళాలు, కటౌట్లు, బ్యానర్లు  నినాదాలు లేకుండా అలా రైలు దిగి ఇలా నడచుకుంటూ, బసకు చేరి అటు నుంచి నేరుగా గాంధీ భవన్ లోకి ఎంట్రీ ఇవ్వడంలోనే మీనాక్షి నటరాజన్  తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక అక్కడి నుంచి ప్రతి పనిలోనూ ఆమె తమ  ప్రత్యేకత చాటుకుంటూనే ఉన్నారు. బహుశా ఆమెకు  మరే ఇతర బరువు బాధ్యతలు, వ్యాపార, వ్యవహారాలు లేక పోవడంవల్లనో ఏమో కానీ  పార్టీ కోసం  పూర్తి సమయాన్నికేటాయించి పనిచేస్తున్నారు. 

నిజానికి  కాంగ్రెస్ పార్టీలో.. ఆ మాట కొస్త, బీజేపీలో అయినా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌  అంటే సహజంగా  ఏదో అలా చుట్టపు చూపుగా వచ్చి..  వచ్చిన పని చక్క  పెట్టుకుని పోవడమే కానీ.. ఇలా రాష్రంలోనే తిష్టవేసి పనులు చక్కబెట్టడం గతంలో అంతగా లేదు. కానీ..  మీనాక్షి నటరాజన్ అలా కాదు. అందుకే..  ఆమె కమిట్మెంట్ తో పనిచేస్తున్నారనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోం ది. అందుకే.. కాంగ్రస్ శ్రేణులు  మీనాక్షి మేడం  ప్రత్యేకం అంటున్నారు. అందుకే ఆమె  కేవలం ఇన్‌చార్జ్‌  మాత్రమే కాదు..  అంతకంటే ఎక్కువ అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. అందుకే ప్రభుత్వంలో, పార్టీలో పదవులు కోరుకునే నాయకులు తరతమ బేధం లేకుండా గాంధీ భవన్ కు క్యూకడుతున్నారు. ఆమెను కలుస్తున్నారు.  విజ్ఞాపన పత్రాలు ఇచ్చి పోతున్నారు. 

అయితే..  పరిస్థితి మెల్లమెల్లగా మారుతోంది. ఆమె ఎంత కమిట్మెంట్ తో పనిచేసినా..  పెద్దగా ఫాయిదా లేకుండా పోతోందని  పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. ఆమె ఎంత  స్ట్రిక్ట్ గా ఉన్నా.. ఎంత గట్టిగా గీతలు గీస్తున్నా.. గీత దాటుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని అంటు న్నారు. అందుకే..  ఆమెను ఎంట్రీ టైములో మెచ్చుకున్న నాయకులే ఇప్పడు  పెదవి విరుస్తున్నారు.ఏ దో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్లుగా పరిస్థితి వుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ముందుకంటే ఇప్పుడు మరింత గందరగోళ పరిస్థితులు ఉన్నాయని  అంటున్నారు.

ప్రస్తుతం వరంగల్ కాంగ్రెస్ నేతలు మధ్య సాగుతున్న వర్గ పోరు గానీ..  కొద్ది రోజుల క్రితం మహిళా కాంగ్రెస్ నాయకులు, మధ్యలో ఎస్సీ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత గొర్రెల మందతో సహా గాంధీ భవన్  ప్రాంగణంలోనే యాదవులు ధర్నాచేయడం వంటి సంఘటనలు చోటు  చేసుకోవడంతో మీనాక్షి నటరాజన్ మీద పెట్టుకున్న ఆశలు మెల్లమెల్లగా ఆవిరై పోతున్నాయని అంటున్నారు.   ఇక జిల్లాల్లో పరిస్థితి గురించి అయితే చెప్పుకోనక్కర లేదు. వేదిక పై జిల్లా మంత్రి ఉన్నా మరో నాయకుడు ఉన్నా, పార్టీ సమావేశాలు, చాలవరకు రసాబాసగా ముగుస్తున్నాయి.    

మొత్తంగా చూస్తే  పార్టీలో ముందుకన్నా ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు ఎక్కువ అయ్యాయని అంటున్నారు. మీనాక్షి మేడం ఎంట్రీకి ముందు జిల్లాలకే పరిమితమైన అంతర్గత కుమ్ములాటలు  ఇప్పుడు గాంధీ భవన్  కు చేరుకున్నాయి. అలాగే మంత్రి పదవులు మొదలు నామినేటెడ్ పోస్టుల వరకూ  పదవులు ఆశించి భంగ పడిన వారు, పదవులు ఆశిస్తున్న వారు గాంధీ భవన్ ని ధర్నాచౌక్ గా మార్చేస్తున్నారని అంటున్నారు. చివరకు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని గట్టి వార్నింగ్ ఇచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు సరికదా.. మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ, కొండా మురళీ తాజా ఎపిసోడ్ తో క్రమశిక్షణ కట్లు తెంచుకున్నన వైనం కనిపిస్తోందని అంటున్నారు.  మరో వంక మంత్రుల మధ్య సయోధ్య  లేకపోవడం, మంత్రుల పని తీరు పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తిని వ్యక్తం చేయడం.. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనివార్యం కావడంతో..  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కు చేతి నిండా పనుందని.. అలాగే  అంతర్గత, బహిర్గత రాజకీయం వేడెక్కుతున్న నేపథ్యంలో  మీనాక్షి నటరాజన్ కు చేతి నిండా పని మాత్రమే కాదు, సవాళ్ళూ చాలానే ఉన్నాయని అంటున్నారు.  నిజానికి, అసలు టెస్ట్ ఇప్పుడే మొదలైందని అంటు న్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu