కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందే ఎదురుదెబ్బలు

 

మూలిగే ముసలి నక్క మీద తాటిపండు పడినట్లు సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం పాలయిన కాంగ్రెస్ పార్టీ నెత్తిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు వచ్చిపడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షపార్టీ అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (యన్.సి.పి.) అధికార కాంగ్రెస్ పార్టీతో సీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆ పార్టీతో తెగతెంపులు చేసేసుకొని ఒంటరి పోరాటానికి సిద్దపడింది. అది అంతటితో ఆగితే బాగుండేది. మహారాష్ట్రలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా బలీయమయిన రాజకీయ శక్తిగా ఎదగాలని తహతహలాడుతున్న యన్.సి.పి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు సైతం వెనుకాడకుండా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయకతప్పలేదు.

 

మరొక 15రోజులలో ఎన్నికలు ముంచుకు వస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం చాలా పెద్ద దెబ్బే. కానీ కాంగ్రెస్ కష్టాలు అంతటితో ముగియలేదు. నెల రోజుల క్రితమే మహారాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేప్పట్టిన తెలంగాణాకు చెందిన సీనియర్ బీజేపీ నేత విద్యాసాగర్ రావు, పద్ధతి ప్రకారం ప్రతిపక్ష పార్టీలయిన బీజేపీ శివసేనలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? అని అడిగారు. ఆ రెండు పార్టీలు అందుకు సిద్దం కాకపోవడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్నుఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని అడగకుండా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని కేంద్రానికి లేఖ వ్రాసి పడేసారు.

 

సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కేంద్రం ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఉన్నప్పటికీ హడావుడిగా నిన్న మంత్రివర్గ సమావేశం గవర్నరు ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసేయడం, దానిని తక్షణమే రాష్ట్రపతికి పంపగానే ఆయన కూడా దానిపై ఆమోదముద్ర వేసేయడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చేసింది. అంటే బీజేపీకి చెందిన గవర్నరు విద్యాసాగర్ రావు చేతిలోకి సర్వాధికారాలు వచ్చేసాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగయినా గెలిచి మహారాష్ట్రలో స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని తహతహలాడుతున్న బీజేపీకి ఈ పరిణామాలన్నీ కలిసి వచ్చే అంశాలుగా మారగా, అవినీతి ఊభిలో కూరుకుపోయిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఈ ఊహించని పరిణామాలన్నీ ఎదురుదెబ్బలే అవుతాయి.

 

అందుకే కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర గవర్నరు పృథ్వీరాజ్ చవాన్నుఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని అడగకుండా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసి సాంప్రదాయాలను తుంగలో తొక్కారని విరుచుకు పడుతోంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సార్లు తన రాజకీయ ప్రయోజనాలను దృష్టి ఉంచుకొని ఇదే విధంగా వ్యవహరించింది కనుక ఇప్పుడు దాని గోడు ఎవరూ పట్టించుకోలేదు.

 

సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్ చేతిలో నుండి అధికారం జారిపోవడం, మిత్రపక్షమయిన యన్.సి.పి.తో సహా ఈసారి బీజేపీ, శివసేనలను కూడా ఎన్నికలలో ఎదుర్కోవలసి రావడం ఇత్యాది అంశాలన్నీ ఆ పార్టీ విజయావకాశాలను కుచించివేసేవిగా ఉన్నాయి. ఈ ఎన్నికలలో గెలవడం కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో, బీజేపీకి, శివసేనకు, యన్.సి.పి.కి కూడా అంతే ముఖ్యం కనుక ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారనున్నాయి.