జయలలిత రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనా?

 

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష రూ.100వంద కోట్ల జరిమానా విదించింది. ఆమెతో బాటు ఆమె స్నేహితురాలు శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు కూడా ఒక్కొక్కరికీ నాలుగు సం.ల జైలు శిక్ష మరియు రూ.12కోట్ల జరిమానా విదించబడింది. కోర్టు శిక్షలు ఖరారు చేయడంతో పోలీసులు వారందరినీ పరప్పన అగ్రహారంలోని జైలుకు తరలించి అక్కడ ఆసుపత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈరోజు శనివారం కావడం తరువాత కోర్టులకు దసరా శలవులు మొదలవుతుండటంతో జయలలిత ఆమె అనుచరులకు మరో వారం పదిరోజుల వరకు బెయిలుకు అప్పీలు చేసుకొనేందుకు కూడా అవకాశం లేదు కనుక అంతవరకు జైలులో ఉండక తప్పదు. వారందరికీ నాలుగేళ్ళు జైలు శిక్ష పడినందున వారు కర్నాటక హైకోర్టులోనే అప్పీలు చేసుకోవలసి ఉంటుంది. హైకోర్టు వారికి బెయిలు మంజూరు చేస్తుందా లేదా అనే విషయాన్ని పక్కనబెడితే, ఆమె తన పదవులకు రాజీనామా చేసినా చేయకున్నా ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆమె తన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పదవులు రెండూ కోల్పోతారు. అంతే కాదు జైలు శిక్ష పడినందున మరో పదేళ్లవరకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారు. అంటే ఆమె రాజకీయ జీవితానికి ముగింపు వచ్చినట్లే భావించవచ్చును.

 

ఇక మరో అతి పెద్ద సమస్య కోర్టు విధించిన రూ.100 కోట్ల జరిమానా. ఆమెతో సహా మిగిలిన ముగ్గురూ కూడా ఎలాగు హైకోర్టుకి అక్కడా ఎదురుదెబ్బ తగిలితే సుప్రీంకోర్టుకి వెళతారు కనుక జరిమానా చెల్లింపు విషయంలో పై కోర్టులు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సమర్దించవచ్చును, లేదా రద్దు చేయవచ్చును లేదా కొంత తగ్గించవచ్చును. కనుక ప్రత్యేక న్యాయస్థానం విదించిన జరిమానా గురించి ఆలోచించడానికి ఇంకా సమయం ఉందని చెప్పవచ్చును.

 

ఒకవేళ పై కోర్టులు కూడా ప్రత్యేక న్యాయస్థానం తీర్పును సమర్దిస్తే, వారందరికీ మరిన్ని కష్టాలు తప్పవు. ఎందువలన అంటే వారు నలుగురు కలిసి రూ.130 కోట్లు ఎక్కడి నుండి తీసుకు వచ్చేరో దానికి లెక్క, దానికి మళ్ళీ పన్ను చెల్లించారా? లేదా?వంటి కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి.

 

ఏమయినప్పటికీ ఈ కోర్టు తీర్పుతో ఇప్పటి వరకు దివ్యంగా వెలిగిపోతున్న జయలలిత రాజకీయ జీవిత ప్రభ ఒక్కసారిగా ఆరిపోయినట్లయింది. ఆమె ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చూసింది. కానీ ఈ దెబ్బ నుండి తేరుకోవడం బహుశః ఆమె వల్ల కాక పోవచ్చునేమో. అదే జరిగితే తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు జరిగే అవకాశం ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu